జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ పూర్తయ్యాకే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులపై విచారణ చేపట్టాలంటూ పలువురు నిందితుల తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టుకు నివేదించారు. సీబీఐ కేసుల అనంతరం ఈడీ కేసుల విచారణ చేపట్టాలన్న పిటిషన్లపై మంగళవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, ఇండియా సిమెంట్స్ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా లిమిటెడ్, జనని ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్, పెన్నా ప్రతాప్‌రెడ్డి, పెన్నా గ్రూపు కంపెనీలు, రాంకీ ఫార్మా, దాని ఛైర్మన్ అయోధ్యరామిరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇందూ గ్రూపు కంపెనీల తరఫున ఉమామహేశ్వరరావు, జి.అశోక్‌రెడ్డిల న్యాయవాదులు మంగళవారం వాదనలు వినిపించారు.
ఈడీ కేసులకు ఆధారం సీబీఐ కేసులేనని చెప్పారు. మనీలాండరింగ్ నిరోధక చట్టానికి చేసిన సవరణ ప్రకారం రెండు కేసులనూ ఒకే కోర్టులో విచారించాలని చెప్పారు. ఈడీ కేసును స్వతంత్రంగా విచారణ చేపట్టాలని భావిస్తే జగతి పబ్లికేషన్స్ కేసును మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు నుంచి ఇక్కడికి బదిలీ చేయాలని ఎందుకు దరఖాస్తు చేయాల్సి వచ్చిందన్నారు. అందువల్ల ఈడీ వాదన చెల్లదని, సీబీఐ కేసు తరువాతే విచారణ చేపట్టాల్సి ఉందన్నారు. ఇదే అంశంపై ఇతర నిందితుల వాదనల నిమిత్తం విచారణ ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈడీ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌పై ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్లను సీబీఐ కోర్టు ఉపసంహరించింది. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో ఉన్న హెటిరో, అరబిందోలకు సంబంధించిన ఈడీ కేసు విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దానిపై ఈనెల 20న విచారణ ఉందని, అందువల్ల ఇక్కడ విచారణను వాయిదా వేయాలని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఎంఎస్‌జె కోర్టు విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
ప్రభుత్వంతో సంప్రదించాక 'పంచాయతీ' షెడ్యూలు: రాష్ట్ర ఎన్నికల సంఘం