దిల్లీలో కరోనా బారిన పడిన తెలుగు పాత్రికేయుల పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. వారికి అవసరమైన సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్టులకు కరోనా పరీక్షలు, చికిత్సల విషయమై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దిల్లీ అపోలో ఆసుపత్రి వర్గాలతో మంగళవారం మాట్లాడారు. అవసరానికి అనుగుణంగా ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దిల్లీలో పరిస్థితిపై ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్ త్రిపాఠి, రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, ప్రత్యేక కమిషనర్ రమణారెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఉపరాష్ట్రపతి చొరవ.. ఆర్థిక సహాయం..
తెలుగు జర్నలిస్టులు కరోనా బారిన పడిన విషయం తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెంటనే స్పందించారు. జర్నలిస్టులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. వారికి అవసరమైన చికిత్సలు అందించాలని ఆర్‌ఎల్‌ఎం, అపోలో ఆసుపత్రి యాజమాన్యాలతో స్వయంగా మాట్లాడారు. తొలుత పాజిటివ్‌గా తేలిన వ్యక్తి చికిత్సకు రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. తర్వాత పాజిటివ్‌గా తేలిన ఇద్దరు వ్యక్తులకు దిల్లీ ఆసుపత్రుల్లో పడకలు దొరకకపోవడంతో హరియాణాలోని ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి వారికి అక్కడ పడకలు ఏర్పాటు చేయించారు.
సొంత ఖర్చులతో పరీక్షలు చేయించిన కిషన్‌రెడ్డి
జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులు 31 మందికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తన సొంత ఖర్చుతో అపోలో ఆసుపత్రిలో మంగళవారం పరీక్షలు చేయించారు. మరికొందరికి బుధవారం పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి: