voter enrollment in andhra pradesh: పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, కొత్త కేంద్రాల ఏర్పాటు వంటి ప్రక్రియలు చేపట్టినప్పుడు... ఒక కుటుంబంలోని సభ్యుల ఓట్లన్నీ కచ్చితంగా ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు/ జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘ఒకే భవనంలో నివసిస్తున్న వారి ఓట్లన్నీ ఒకే ప్రాంతంలోని కేంద్రం పరిధిలో ఉండాలి. ఇప్పటికే ఏమైనా లోపాలుంటే వాటిని వెంటనే సరిదిద్దాలి...’ అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాల రూపకల్పన ప్రక్రియలో పలు లోపాలున్నాయని, అవకతవకలు జరుగుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలోని సభ్యుల ఓట్లను మూడు నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో చేర్చడం వల్ల వారు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ పై మేరకు స్పందించారు. ఆయన కార్యాలయం నుంచి ఈ నెల 11న వర్లకు ప్రత్యుత్తరం వచ్చింది. వర్ల తన లేఖలో ప్రస్తావించిన అంశాలపై ఇచ్చిన ఆదేశాల ప్రతిని కూడా జత చేశారు.
చనిపోయిన వ్యక్తుల పేర్లు తొలగించండి - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
AP Chief Electoral Officer K Vijayanand: చనిపోయిన వ్యక్తులు, వలస వెళ్లిన వారి పేర్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను విజయానంద్ ఆదేశించారు. ఒక నిర్దిష్ట సంవత్సరానికి సంబంధించి ఓటర్ల జాబితాల సవరణ నిమిత్తం రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల(బీఎల్‌ఏ)ను నియమించాక, ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా వారే కొనసాగుతారని స్పష్టం చేశారు. వారిని బీఎల్‌ఏలుగా తొలగించాలని సంబంధిత రాజకీయపార్టీ కోరేంత వరకు వారే ఉంటారన్నారు. కొన్ని చోట్ల వీఆర్‌ఏలు వైకాపా మద్దతుదారుల ఓట్లు మాత్రమే ఉంచి, వైకాపాయేతర పార్టీలకు చెందిన వారి ఓట్లు తొలగిస్తున్నారని, తటస్థ, వైకాపాయేతర పార్టీల ఓటర్లను వాలంటీర్లు బెదిరిస్తున్నారని చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ... అలాంటివి ఎక్కడైనా జరిగితే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:
PRC ORDERS: ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్.. డిమాండ్లు బేఖాతరు!