రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తులకు ధృవీకరణ పత్రం జారీ చేసేందుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన భేటీ కానున్న మంత్రివర్గం ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటు అంశంపై చర్చించి ఆమోదాన్ని తెలియచేయనుంది. ఇప్పటికే ఈ తరహా అథారిటీలు 12 రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఏపీలోనూ ఇదే తరహా సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఆర్గానిక్ ఫాం గా గుర్తించిన సంస్థలు మాత్రమే ఉత్పత్తులు విక్రయించేలా కొత్త విధానం తీసుకురానున్నారు. ఇక ఆసరా పథకంలో భాగంగా రెండో విడత మొత్తాన్ని విడుదల చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదాన్ని తెలియచేయనుంది.
మరోవైపు గృహ నిర్మాణ పథకాల్లో లబ్దిదారులకు అదనంగా 35 వేల రూపాయల రుణాన్ని ఇచ్చే అంశాన్ని కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో నాడు-నేడు పథకం కింద పాఠశాలలు, ఆస్పత్రులను పునర్నిర్మించేందుకు ఆర్ధిక సహకారాన్ని అందించే దాతల పేర్లను వాటికి పెట్టేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకువచ్చే ప్రతిపాదనపైనా కేబినెట్ చర్చించనుంది. విశాఖ మన్యంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనపై కూడా ఆమోదం తెలిపే అవకాశముంది. రాష్ట్రంలో కొత్తగా బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈసారి బడ్జెట్ లో మైనారిటీ సబ్ ప్లాన్ రూపకల్పన, అమలు తదితర అంశాలకు సంబంధించిన ప్రతిపాదనల పైనా కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం. సీఐడీలో 50 హోం గార్డు ఉద్యోగాలు, కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు సంబంధించి ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. మొత్తం 40 అంశాలతో కూడిన అజెండాను మంత్రివర్గం చర్చించనుంది.
ఇదీ చదవండి..
HIGH COURT: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు