ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయ్యాక మళ్లీ అంతా రోడ్ల మీదికొచ్చి తిరగాల్సిందేనని... ముఖ్యమంత్రి జగన్ మంత్రులను ఆదేశించారు. మంత్రిమండలి సమావేశం తర్వాత కొద్దిసేపు మంత్రులతో ప్రత్యేకంగా ముచ్చటించిన సీఎం... క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందిగా దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు... గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలన్నారు. తానూ వెళ్తానని చెప్పినట్లు తెలిసింది. కొవిడ్ పరిస్థితిని బట్టి రచ్చబండ కార్యక్రమం చేస్తానని అన్నట్లు సమాచారం. ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి పార్టీ తరఫున పనిచేసేందుకు ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ బృందం కూడా వస్తుందని.. ఈలోగా క్షేత్రస్థాయిలో ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. అందుకు తగ్గట్టుగా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను సంసిద్ధుల్ని చేయాల్సిందిగా మంత్రులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మంత్రిమండలిలో ఉన్న 80 శాతం మందిని తప్పించి, ఎన్నికల బృందంగా వాడుకోవాలని గతంలోనే సీఎం నిర్ణయించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. తనకు మంత్రి పదవి లేకపోయినా ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహిత సంబంధాలతో విలేకర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు కృషి చేస్తానని పేర్ని నాని తెలిపారు.
ఇదీ చదవండి..