వైకాపా ప్రభుత్వం హిందుత్వంపైనా... హిందుత్వ ఆలోచనలపై వ్యతిరేకత చూపుతోందని భారతీయ జనతా పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేసింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు సత్యమూర్తి, మధుకర్, విశ్వహిందూపరిషత్తు రాష్ట్ర కార్యదర్శి రవికుమార్‌తో కూడిన బృందం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు, ప్రార్థన మందిరాలపై జరిగిన దాడుల వివరాలను వినతి పత్రంలో పొందుపరిచారు. పిఠాపురం, నెల్లూరు, పశ్చిమగోదావరిలో జరిగిన దాడులపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని... అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం వెల్లడించిందని తెలిపారు.
హిందు ధర్మానికి ఎక్కువగా కొందరి వల్ల ఇబ్బంది ఏర్పడిందనే అభిప్రాయాన్ని ప్రభుత్వ అధికారులు ప్రకటిస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ పరిణామాలన్నీ ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయని... ప్రభుత్వం హిందూ దేవాలయాల పవిత్రను కాపాడుతుందా?అనే అనుమానం అందరిలోనే నెలకొంటోందని భాజపా నేతలు అన్నారు. అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద రథం దగ్ధం ఘటన అనంతరం ఆ ప్రాంతానికి వెళ్లిన 41 మందిపై కేసులు నమోదు చేసి... నేటికీ బెయిల్ రాకుండా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారని భాజపా బృందం గవర్నర్‌కు వివరించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, సంబంధితులను పిలిపించి హిందూ ఆలయాల పరిరక్షణ విషయంలో తీసుకున్న చర్యల గురించి చర్చించాలని విజ్ఞప్తి చేసింది. హిందువులపై పెట్టిన కేసులను భేషరతుగా ఎత్తి వేయాలని నేతలు కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. హిందూ ఆలయాలు, ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక నేతలు, మఠాధిపతులు, స్వామిజీల సమక్షంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్తు డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి