నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి రోజు 11 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. వీటితోపాటు మరికొన్ని కొత్త చట్టాలు, చట్టసవరణలకు సంబంధించిన 30 బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సంక్షేమ కార్యక్రమాలను, పోలవరం ప్రాజెక్టు పనులు, నాడు-నేడు పనితీరు సహా పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారపక్షం సభ ద్వారా ప్రజలకు వివరించనుంది. శాసనసభ, మండలి సమావేశాలకు వేర్వేరు వ్యూహాలతో అధికారపక్షం సిద్ధమైంది.
వ్యూహ-ప్రతివ్యూహాలు
ప్రభుత్వం వైఫల్యాలు సహా రైతు సమస్యలు, ప్రజలపై మోపుతున్న పన్నుల భారం సహా వరదలు, పంటనష్టాలపై అంసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాలు సిద్ధం చేసింది. నాలుగు ప్రధాన డిమాండ్ల పరిష్కారంతో పాటు 15 అంశాలపై చర్చకు పట్టుబట్టనుంది. పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న తెలుగుదేశం...ఆయా అంశాలను సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. రాజధాని ఆందోళనపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని సభలో ఎండగట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ సభ ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణ బయట రోజుకో అంశంపై నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది.
శాసనసభా సమావేశాలు కనీసం 10 రోజులైనా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుండగా....ఎన్నిరోజులైనా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : సభాక్షేత్రంలోకి అస్త్రశస్త్రాలతో తెలుగుదేశం పార్టీ..!