నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉండొచ్చన్న చర్చ రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తున్నా... సభలో ప్రత్యేక చర్చ కచ్చితంగా ఉంటుందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. తొలిరోజే మూడు రాజధానుల అంశంపైనే శాసనసభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారని చెబుతున్నారు. దీనిపై ఆయన రాజకీయంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం వైకాపా అసెంబ్లీ వ్యవహారాల వ్యూహ కమిటీ బుధవారం సమావేశమై చర్చించింది. ముఖ్యమంత్రి తన కార్యాలయ ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయి సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిసింది.
ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో మొదట ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. మృతి చెందిన మాజీ సభ్యులకు సంతాపం తెలుపుతూ సభలో తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు.
మొత్తమ్మీద ఈ అసెంబ్లీ సమావేశాల్లో 25 అంశాలపై చర్చించాలని అధికార పక్షం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ సమావేశాల్లో రెవెన్యూశాఖ 4 బిల్లులను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇందులో మూడు బిల్లులు చట్ట సవరణకు, ఒక బిల్లు రద్దుకు సంబంధించినవి ఉన్నాయి. 'ఆటో మ్యుటేషన్ విధానానికి అనుగుణంగా రికార్డ్స్ ఆఫ్ రైట్-1971 చట్టాన్ని సవరించనున్నారు. భూముల రీ-సర్వే అనంతరం యజమానులకు 'శాశ్వత భూ యాజమాన్య' హక్కు కల్పించేందుకు ఉద్దేశించిన 'టైటిలింగ్ యాక్టు'లో సవరణ తీసుకురాబోతున్నారు. ఈ బిల్లును మూడోసారి పెడుతున్నారు. దీనికి చట్టసభల్లో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర హోంశాఖకు పంపనున్నారు. గతంలో ఒకసారి కేంద్రానికి పంపగా హోంశాఖ కొన్ని అభ్యంతరాలు తెలిపింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం నల్సార్ విశ్వవిద్యాలయంతో అధ్యయనం చేయించింది.
తాజా సవరణలకు కేంద్రం ఆమోదం తెలిపితే ఇళ్లు, భూములపై యజమానులకు శాశ్వత హక్కులు దక్కుతాయి. 1956 నాటి కౌలు చట్టాన్ని రద్దు చేసే బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ ఇనామ్స్ అబాలిషన్ చట్టానికి (1956) సవరణ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలనాటి జమీందారులు, ఇతర పెద్దల నుంచి పొందిన భూముల్లో ఇనాందారులు 33% మాత్రమే సాగు చేసుకోవాలి. మిగిలిన దాన్ని రైతులకు కౌలుకు ఇవ్వాలి. కౌలుకు ఇవ్వకుండా మొత్తం భూమి ఇనాందారు పర్యవేక్షణలో ఉంటే...64% భూమి ప్రభుత్వ పరమయ్యేలా చట్టసవరణ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇవీ చదవండి: