2019 సంవత్సరం మొత్తమ్మీద రాష్ట్రంలో 8,37,040 మంది జన్మిస్తారని అంచనావేస్తే.. 7,54,939 మందే పుట్టారు. ఇందులో అంచనాల కంటే 9.80% తరుగుదల కనిపించింది. 3,50,511 మంది మరణిస్తారనుకుంటే 4,01,472 మరణాలు సంభవించాయి. ఇందులో 14.53% పెరుగుదల నమోదైంది.
ప్రాంతాల వారీగా ఇలా...
రాష్ట్రంలో జన్మించిన పిల్లల్లో 34% గ్రామాల్లో, 66% పట్టణాల్లో ఉన్నారు. మొత్తం మరణాల్లో 65% గ్రామీణ ప్రాంతాల్లో, 35% పట్టణప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. మొత్తం జననాల్లో 37% రాయలసీమ జిల్లాల్లో, 18% ఉత్తరాంధ్ర జిల్లాల్లో, 45% కోస్తా జిల్లాల్లో సంభవించాయి. మరణాల విషయానికి వచ్చేసరికి రాయలసీమలో తగ్గగా.. కోస్తాజిల్లాల్లో పెరిగాయి. 2019లో సంభవించిన మొత్తం మరణాల్లో రాయలసీమ జిల్లాల్లో 28%, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 19%, కోస్తా జిల్లాల్లో 53% చొప్పున ఉన్నాయి. జననాలతో పోలిస్తే మరణాలు కోస్తాజిల్లాల్లో 8% అధికంగా ఉన్నాయి.
మరణాల తీరు ఇలా..
* జననాలు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలోనే అత్యధిక శిశుమరణాలు (1,350) నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో విశాఖపట్నం (1,033), తూర్పుగోదావరి (975) జిల్లాలు నిలిచాయి. అతి తక్కువ శిశుమరణాలు (39) కడప జిల్లాలో నమోదయ్యాయి.
* రాష్ట్రంలో మరణించేవారిలో 36% మంది 70 ఏళ్లు దాటినవారే ఉంటున్నారు. 2019లో ఈ వయస్సువారు 1,42,980 మంది కన్నుమూశారు. ఆ తర్వాతి స్థానంలో 55-64 ఏళ్లవారు, 45-54 ఏళ్లవారు, 65-69 ఏళ్లవారు ఉంటున్నారు. 1-4 ఏళ్ల వయస్సులో అతి తక్కువ మరణాలు ఉంటున్నాయి.
* తెలంగాణ మరణాలతో పోల్చి చూస్తే ఏపీలో 65 నుంచి 69 ఏళ్ల మధ్య వయసులో మరణాలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ఈ వయసు మరణాలు 40% ఉండగా.. ఏపీలో 11.97% మాత్రమే ఉన్నాయి.
జనన మరణాల నమోదు...
* రాష్ట్రంలో సంభవించిన జననాల్లో 90.2%, మరణాల్లో 100% అధికారికంగా నమోదయ్యాయి.
* భారత్‌లో సగటున 92.7% జననాలు రికార్డులలో నమోదవుతుండగా, ఆంధ్రప్రదేశ్ అంతకంటే తక్కువ స్థాయిలో ఉంది.
* రాష్ట్రం విడిపోయిన తర్వాత అతి తక్కువ నిష్పత్తిలో జననాలు నమోదైంది ఈసారే. 2014లో 98.3%, 2015లో 99.1% 2016లో 96.5%, 2017లో 97.6%, 2018లో 91.4% మేర నమోదయ్యాయి. తెలంగాణలో జననాలు 100% నమోదవుతున్నాయి.
* మరణాలు 100% నమోదవుతున్న 19 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. రాష్ట్రం విడిపోయిన తొలి నాలుగేళ్లలో 82.7%, 85.6%, 89.5% 95% నమోదుకాగా, 2018, 2019ల్లో 100% నమోదయ్యాయి. తెలంగాణలో మరణాల నమోదు 97.2%గా ఉంది.
* ఆంధ్రప్రదేశ్‌లో పెద్దసంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామకార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీల పరిధిలో చాలా సబ్‌రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గణాంక వ్యవహారాల సిబ్బందికి ప్రయాణభత్యాల బడ్జెట్ ఇవ్వకపోవడంతో రిజస్ట్రేషన్ కేంద్రాల తనిఖీలపై ప్రభావం పడుతోంది.
లింగనిష్పత్తిలో తెలంగాణ కంటే వెనుకబాటు
జనన సమయాల్లో లింగనిష్పత్తి ఆంధ్రప్రదేశ్‌లో 935గా ఉంది. అంటే.. ప్రతి వెయ్యి మంది బాలురకు 935 మంది బాలికలే జన్మిస్తున్నారన్న మాట. ఈ విషయంలో రాష్ట్రందేశంలో 16వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో లింగనిష్పత్తి 953 ఉండటంతో.. ఆ రాష్ట్రం ఏడో స్థానంలో నిలిచింది. దేశంలో అరుణాచల్‌ప్రదేశ్ (1024), నాగాలాండ్ (1001)ల్లో మాత్రమే లింగనిష్పత్తి అత్యధికంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మిజోరం (975), అండమాన్ (965) కేరళ, ఉత్తరాఖండ్ (960), తెలంగాణ (953) ఉన్నాయి.
ఇదీ చదవండి: