రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఇళ్ల కాలనీల నిర్మాణానికి లక్షా 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. కృష్ణా జిల్లాలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలుపై.. జలవనరులశాఖ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్రంలో ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 17వేలకుపైగా జగనన్న ఇళ్ల కాలనీలు నిర్మిస్తున్నామని.. దీనివల్ల కొత్తగా 17వేల ఐదు వందల గ్రామాలు రాబోతున్నాయని చెప్పారు. నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యేల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని చెప్పారు. తాపీమేస్త్రీల కొరత ఉన్నచోట ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి రప్పించాలని మంత్రి చెరుకువాడ సూచించారు.
'గృహనిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులతో గ్రూపులు ఏర్పాటు చేసి ఇసుక, సిమెంట్, ఇనుము వంటివి ఒకే మొత్తంలో కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలి. అప్పుడే నిర్మాణ వ్యయం తగ్గుతుంది. తాపీమేస్త్రీల కొరత ఉన్నచోట ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి రప్పించాలి. వీలున్న చోట్ల బ్రిక్ పరిశ్రమలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు ఇటుకలు సరఫరా చేసే ఆలోచన చేయాలి. ప్రభుత్వం పేదలకు ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల విలువైన స్థలం ఇవ్వడంతోపాటు.. ఇళ్ల నిర్మాణానికి ప్రత్యక్షంగా లక్ష 80 వేల రూపాయలు.. పరోక్షంగా నాలుగు లక్షల రూపాయల వరకు సహకరిస్తూ లబ్ధిదారులకు చేయూత ఇస్తోంది' అని మంత్రి చెరుకువాడ తెలిపారు.
ఇదీ చదవండి: