liquor rates reduced in andhra pradesh: రాష్ట్రంలో మద్యం ధరల్ని ప్రభుత్వం 15- 20శాతం తగ్గించింది. బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌పై కనీసం రూ.20 నుంచి రూ.50 వరకూ, ఫుల్ బాటిల్‌పై రూ.120 నుంచి రూ.200 వరకూ తగ్గుదల వర్తింపజేసింది. అన్ని రకాల బీర్లపై రూ.20- రూ.30 వరకూ ధర తగ్గనుంది. చీప్‌లిక్కర్ బ్రాండ్లపై అధికంగా, ప్రీమియం బ్రాండ్లపై తక్కువగా ధరలు తగ్గుతాయి. చీప్‌లిక్కర్‌లోని కొన్ని రకాల బ్రాండ్ల ధర తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువగా, మరికొన్ని బ్రాండ్ల ధర తెలంగాణతో సమానంగా ఉండేలా సవరించారు. ఒక్కో మద్యం కేసు మూలధరపై వ్యాట్, స్పెషల్ మార్జిన్ రేటు, అదనపు ఎక్సైజ్ సుంకం, అదనపు కౌంటర్‌వయిలింగ్ డ్యూటీలను సవరిస్తూ.. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ధరల తగ్గింపు ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. చీప్ లిక్కర్ రేట్లు గణనీయంగా తగ్గటం వల్ల వినియోగం మరింత పెరిగి.. ప్రభుత్వానికి లభించే ఆదాయమూ పెరగనుంది.
ధరల తగ్గింపు ఎందుకంటే..
‘రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గించేందుకు మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ డ్యూటీ విధించాం. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకు ఇతర రాష్ట్రాలతో సమానంగా వ్యాట్ సవరించి, స్పెషల్ మార్జిన్ రేటు తీసుకొచ్చాం. అయినా మద్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నియంత్రణ, నాటుసారా అరికట్టేందుకు మద్యం ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 2019లో నాటుసారా కేసులు 15,638 నమోదయితే.. ఈ ఏడాదిలో నవంబర్ 21 వరకూ 45,087 నమోదయ్యాయి. సుంకం చెల్లించని మద్యం కేసులు 2019లో 1,841 నమోదు కాగా ఈ ఏడాదిలో నవంబర్‌కే 17,654 నమోదయ్యాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో సుంకం చెల్లించని మద్యం, నాటుసారా వినియోగం పెరిగినట్లు అర్థమవుతోంది. అసాంఘిక శక్తులు సుసంపన్నమవుతున్నాయి. పేదలు నాటుసారాకు బలైపోతున్నారు. అందుకే మద్యం వినియోగం తగ్గించేందుకు, అక్రమరవాణా స్మగ్లింగ్, నాటుసారాను అరికట్టేందుకు వీలుగా ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ధరలు తగ్గిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో వివరించారు. నిన్న మొన్నటి వరకు ప్రజల్ని మద్యం వ్యసనం నుంచి దూరం చేసేందుకే ధరలు పెంచామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికాదాయం కోసం ధరల్ని తగ్గిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకే ధరలు పెంచామని అప్పట్లో సీఎం ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ధరలు తగ్గిస్తున్నామని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంటే మద్యం వినియోగాన్ని ప్రోత్సహించి, ఆదాయం పెంచుకునేందుకు కాదా?’ అని నిలదీస్తున్నాయి.
వివిధ రకాల సుంకాల హేతుబద్ధీకరణ ఇలా..
* వివిధ కేటగిరీల మద్యానికి సంబంధించి ఒక్కో కేసు మూల ధరపై గతంలో 130-190 శాతం వరకూ వ్యాట్ విధించేవారు. గత నెల 9న దీన్ని ఆయా 35-60 శాతానికి తగ్గించారు. ఆ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు కొత్తగా స్పెషల్ మార్జిన్‌రేటు తీసుకొచ్చి 85-130 శాతం వరకూ విధించారు. దీంతో వినియోగదారుడికి విక్రయించే మద్యం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తాజాగా ఒక్కో మద్యం కేసు మూల ధర రూ.400 లోపు ఉన్న రకాలపై మాత్రమే 50 శాతం వ్యాట్ ఉంచారు. మిగతా అన్ని కేటగిరీలపై 10 శాతం మాత్రమే వ్యాట్ ఉంచారు.
* ఒక్కో మద్యం కేసు మూల ధర రూ.400 నుంచి రూ.2,500 వరకూ ఉండే రకాలపై 130 శాతం స్పెషల్ మార్జిన్ రేటు ఉండేది. ఆ కేటగిరీని నాలుగు విభాగాలుగా విభజించి 110 శాతం నుంచి 130 వరకూ స్పెషల్ మార్జిన్‌రేటు విధించారు. ప్రధానంగా ఒక్కో మద్యం కేసు మూల ధర రూ.400 నుంచి రూ.1,029, రూ.1,657 నుంచి రూ.1,830 వరకూ ఉన్న రకాలపై స్పెషల్ మార్జిన్ రేటు 20 శాతం, రూ.1,562 నుంచి రూ.1,657 ఉన్న రకాలపై 10 శాతం తగ్గించారు. బీరుపై 70 శాతం ఉన్న వ్యాట్‌ను 40 శాతానికి తగ్గించారు. వీటిన్నింటి వల్ల మద్యం ధరలు తగ్గనున్నాయి.
అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట
మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉండాలి
మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉండాలి. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకే 75 శాతం మేర ధరలు పెంచాం. మనం విక్రయాలు తగ్గించేందుకు తొలుత 25 శాతం మేర ధరలు పెంచాం. దిల్లీలో ఏకంగా 70 శాతం మేర పెంచారు. అందుకే ఇప్పుడు మనం కూడా 75 శాతం మేర ధరలు పెంచాం. మద్యానికి సామాన్యుడు బలికాకూడదనే తాపత్రయంతో అడుగులేస్తున్నాం.
- 2020 మే 5న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫెరెన్స్‌లో సీఎం జగన్ వ్యాఖ్యలు
వినియోగం, స్మగ్లింగ్ తగ్గించేందుకే ధరల తగ్గింపు
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని, నకిలీ మద్యం ఏపీలోకి రావటానికి, నాటుసారా వినియోగానికి అధిక ధరలే మూల కారణం. అందుకే మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు, నాటుసారా నుంచి పేదలను దూరం చేసేందుకు, అక్రమ రవాణా, స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు ధరలు హేతుబద్ధీకరిస్తున్నాం.
- మద్యం ధరలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీవో నెంబర్ 363లో ప్రస్తావన
ఇదీ చదవండి
Ministers Comments: 'వైకాపా ఎంత బలంగా ఉందనేందుకు అమరావతి సభే నిదర్శనం'