ఆనందయ్య కరోనా మందుపై వేసిన పిటిషన్ల మీద.. హైకోర్టులో విచారణ జరిగింది. ఆయుర్వేద కౌన్సిల్‌లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆ మందుపై పరీక్షలు జరుపుతున్నామని వెల్లడించింది. ల్యాబ్‌ల నుంచి ఈ నెల 29న నివేదికలు వస్తాయని పేర్కొంది.
మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలు ఎలా ఇస్తుందని పిటిషనర్ ఉమామహేశ్వరనాయుడు తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. ఆనందయ్యతో ప్రైవేటుగా మందు తయారు చేయిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఔషధానికి ప్రభుత్వ గుర్తింపు కోసం పిటిషన్ వేశామని ఆనందయ్య న్యాయవాది తెలిపారు. ఆయన తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు.
వాదనలు విన్న న్యాయస్థానం.. ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవు కదా అని ప్రశ్నించింది. ఆనందయ్య మందుపై ఎవరు అనుమతివ్వాలో కేంద్రం చెప్పాలని హైకోర్టు పేర్కొంది. ఆనందయ్య ఔషధంపై అభిప్రాయం ఏంటో కేంద్రం తెలపాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలుకు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు అనే వ్యక్తి ఆనందయ్య మందు పంపిణీపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పిటిషన్‌లో ఉమామహేశ్వరనాయుడు కోరారు. ఔషధ పంపిణీ ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరారు. హఠాత్తుగా మందు పంపిణీ ఆపడంతో ఇబ్బంది పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. లోకాయుక్త ఆదేశంతో పంపిణీ నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని.. మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. ఆనందయ్య మందుపైనే మరో పిటిషన్ కూడా దాఖలైంది. వాటిపై విచారించిన ధర్మాసనం.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: