పారిశుద్ధ్య కార్మికుల రక్షణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సిబ్బందికి రక్షణ పరికరాలు కూడా ఇవ్వకపోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. కరోనా విపత్తులో ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు పారిశుద్ధ్య కార్మికులే కారణమన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్న అనగాని.. కరోనా సోకిన వారి వివరాలేవీ అధికారులకు, గ్రామ సచివాలయాలకు చేరడం లేదని మండిపడ్డారు.
కరోనా రోగులు వాడిన వ్యర్థాలను తరలిస్తుండగా సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు అందడం లేదని అనగాని లేఖలో పేర్కొన్నారు. చాలీ చాలని జీతాలతో సిబ్బంది రక్షణ పరికరాలు ఎలా కొనుక్కోగలరని ప్రశ్నించారు. పెండింగ్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. కరోనాతో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, టీకా పంపిణీలో సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఇదీ చదవండి:
100 బెడ్ల ఆస్పత్రి : నేటి నుంచి అందుబాటులోకి అదనపు జీజీహెచ్