వైద్యుల నిర్లక్ష్యం ఓ కుటుంబానికి తీవ్ర వేదనను మిగిల్చింది. కొన్ని గంటల్లో బోసి నవ్వులను చూడాలని ఎదురు చూస్తున్న కళ్లు... ఓ అనుకోని ఘటనతో కన్నీళ్లతో నిండిపోయాయి. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన ఎన్.నిరోషా పెళ్లయిన ఏడు సంవత్సరాల తరువాత గర్భం దాల్చారు. ఆమె విజయవాడలో సూర్యారావుపేటలోని తల్లి పిల్లల వైద్యశాలలో ప్రతి నెలా వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారు. ఇటీవల పరీక్షలు నిర్వహించిన వైద్యులు... గర్భంలో శిశువు పెరుగుదల బాగుందని చెప్పారు. డిసెంబరు 5న ఉదయం వస్తే సాధారణ ప్రసవం చేస్తామని చెప్పటంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. అయితే శుక్రవారం రాత్రి నిరోషాకి ఉమ్మనీరు పడిపోయినట్లు అనుమానం రావటంతో ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేశారు. వైద్యుల సూచనతో రాత్రి 11 గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు పరీక్షించి ఉమ్మనీరు బాగానే ఉందని చెప్పి.. గది ఇచ్చి ఉండమన్నారు. శనివారం ఉదయం వైద్యులు వచ్చి పరీక్షించి బిడ్డ చనిపోయిందని చెప్పారు. రాత్రి సరిగ్గా పరీక్షించకుండానే అంతా బాగుందని చెప్పారని... అపుడే స్కాన్ చేసి ఉంటే బిడ్డ బతికేదంటూ నిరోషా తల్లి శాంతకుమారి ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయం కోసం ఆందోళన
ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయిందంటూ నిరోషా బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నడిరోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీనివల్ల డోర్నకల్ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సముదాయించటంతో వారు ఆందోళన విరమించారు.
మా తప్పేం లేదు
ఘటనలో మా తప్పేమీ లేదు. ఉమ్మనీరు పడిపోయిందని చెప్పటంతో వెంటనే ఆసుపత్రికి రమ్మని సూచించాం. రాత్రి 11 గంటలకు ఆసుపత్రికి రాగానే నిరోషాను పరీక్షించాం. తల్లి, గర్భస్థ శిశువు ఇద్దరూ బాగానే ఉన్నారు. ఉదయం గర్భస్ట శిశువులో కదలికలు లేకపోవటంతో స్కాన్ చేసి శిశువు చనిపోయిందని నిర్ధారించుకున్నాం -అరుణ, వైద్యురాలు
గర్భస్థ శిశువు మృతి చెందటంపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే ఆసుపత్రికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ సుహాసినిని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలపై ప్రతి రోజూ సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు మంత్రి ఆళ్ల నాని సూచించారు. చికిత్స విషయంలో రోగులు, గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆసుపత్రి యాజమాన్యాలు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.