ఆపీ అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. భారత్‌లో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతున్న ఈ సంస్థ ఏర్పడటానికి కారణం జాతి వివక్షపై పోరాడేందుకు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అవును... అమెరికాలో పనిచేసే మన వైద్యులు ఏ చిన్న తప్పు చేసినా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. పదోన్నతులు త్వరగా రావు. జాతి వివక్షలో భాగంగానే ఇన్ని కఠిన నిబంధనలు. దీనిపై పోరాడేందుకే 1982లో ‘ఆపీ’ని ఏర్పాటు చేశారు. మన తెలుగు వైద్యుడు జగన్ కాకరాల ఈ సంఘం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఇందులో 14వేల మంది జీవితకాల సభ్యులున్నారు. అమెరికాలో సుమారుగా పది లక్షల మంది వైద్యులుంటే అందులో 80,000 మంది భారతీయులే.
దేశ వ్యాప్తంగా 17 క్లినిక్‌ల ఏర్పాటు...
2013 నుంచి ఆపీలో నా ప్రయాణం మొదలయ్యింది. తోటి భారతీయుల కోసం ఏదైనా చేయాలన్న ఆశయంతో ఇందులో చేరా. మొదట లోకల్ చాప్టర్‌లో అధ్యక్షురాలిని. తర్వాత ప్రాంతీయ సంచాలకురాలు, ట్రెజరర్, కార్యదర్శి, ఉపాధ్యక్షురాలిగా... ఇలా ఒక్కో పదవిలో చేస్తూ ఇప్పుడు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యా. వివక్షపై పోరాడేందుకు ఏర్పడిన మా సంస్థ ప్రస్తుతం సేవా కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. భారతదేశ వ్యాప్తంగా 17 క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. ఒక్కోదానికీ 5 నుంచి 10 వేల డాలర్ల సాయం అందిస్తున్నాం. తెలంగాణలోని జగిత్యాలలోనూ ఒక క్లినిక్ ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ఏటా 10 లక్షల మందికి ఉచిత వైద్యం అందిస్తున్నాం.
కోట్ల రూపాయలిచ్చాం...
ఆపీ వేదికగా తరచూ విరాళాల సేకరిస్తుంటాం. కొవిడ్ సంక్షోభంలో... పుట్టిన గడ్డకు అండగా నిలవాలని రూ. 37 కోట్లను ఇక్కడ ఆసుపత్రులకు విరాళంగా అందించాం. 2,270 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వంద వరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ ఫ్లో మీటర్ల వంటివి అందజేశాం. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ఆసుపత్రులు ఉన్నాయి. ఇంతేకాకుండా 400 మంది ఆపీ వైద్యులతో భారత్‌లోని రోగులకు టెలీ హెల్త్ సేవల్ని కూడా అందించాం. మాకు కొవిడ్ నేర్పిన పాఠాల్ని భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) సహకారంతో జూమ్ వెబినార్లు నిర్వహించి.... ఇండియాలోని వైద్యులతో పంచుకున్నాం. అమెరికాలో సీపీఆర్ (గుండె పోటుతో అకస్మాత్తుగా కుప్పకూలితే చేతులతో ఛాతిపై మర్దన చేసే వైద్య ప్రక్రియ)కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ సామాన్య ప్రజలు కూడా సీపీఆర్ నేర్చుకుంటారు. ఈ విధానం భారత్‌లో రావాలనే లక్ష్యంతో అన్ని వైద్య కళాశాలల్లో విద్యార్థులకు, నర్సులకు సీపీఆర్ నేర్పించి సర్టిఫికెట్ ఇచ్చేలా చొరవ తీసుకున్నాం. ఉత్తరప్రదేశ్‌లో అయిదు గ్రామాల్లో ‘వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టు’ కింద తాగునీటి ప్లాంట్లను అందించాము. హైదరాబాద్‌లోని ‘నిత్యసేవా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏటా హైదరాబాద్‌లో ‘గ్లోబల్ హెల్త్ సమ్మిట్’ నిర్వహిస్తున్నాం.
అనేక లక్ష్యాలున్నాయి...
వైద్యురాలిగా చికిత్సలు చేస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కొంత కష్టమే. మధ్యాహ్నం వరకు వైద్య విధులు, తర్వాత ఆపీ కార్యకలాపాలు చూసుకుంటాను. మా ప్రధాన కార్యాలయం షికాగోలో ఉంది. ఆపీ అధ్యక్షురాలిగా నా ముందు అనేక లక్ష్యాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌లో వంద గ్రామాలను ఎంపిక చేసి ఒక్కో ఊళ్లో కనీసం వెయ్యి మందికి ఉచిత వైద్య పరీక్షలు చేయాలనుకుంటున్నాం. దీన్ని విజయవంతం చేయాలి. ఇలా నా మాతృదేశపు రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలనుకుంటున్నా.
నేను పుట్టి పెరిగింది వరంగల్‌లోని హన్మకొండలో. నాన్న మోహన్‌రెడ్డి ఆర్‌ఈసీలో ప్రొఫెసర్‌గా చేసేవారు. అమ్మ ప్రమీల. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం. 1983లో కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటొచ్చింది. ఉస్మానియా వైద్య కళాశాలలో అనస్థీషియాలో పీజీ చేశాను. అప్పుడు నీలోఫర్ ఆసుపత్రిలో విధులకు వెళ్లేదాన్ని. తరచూ ఎంతో మంది పసి పిల్లలు మృత్యువాత పడడం చూసి చాలా బాధ కలిగేది. అప్పుడే పీడియాట్రిక్ అనస్థీషియా చేయాలనుకున్నా. అప్పటికి ఇక్కడ ఆ వైద్యం లేదు. తర్వాత అపోలోలో పనిచేశా. 2002లో యూనివర్సిటీ ఆఫ్ మియామీలో అనస్థీషియా రెసిడెన్సీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో పీడియాట్రిక్ అనస్థీషియాలో సబ్ స్పెషాలిటీ చేశాను. భారత్‌లో సూపర్ స్పెషాలిటీనే అమెరికాలో సబ్‌స్పెషాలిటీ అంటారు. ఇప్పుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ శాన్ అంటారియోలో మత్తు వైద్యురాలిగా చేస్తున్నా. మా వారు వెంకటసుబ్బారెడ్డి ఇంజినీరు. మాకు ఇద్దరు పిల్లలు. అపూర్వ ఇక్కడే మెడిసిన్ చేసింది. అబ్బాయి అఖిల్ ఎంబీఏ చదువుతున్నాడు.
ఇదీ చూడండి: BIRD DOCTOR: శస్త్రచికిత్సల్లో వందల సెంచరీలు..