రాజధాని నిర్మాణం ఎక్కడ ఏర్పాటు కానుందో అప్పటి ప్రభుత్వ పెద్దల ద్వారా సమాచారం సేకరించి ఆ భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో మంగళగిరి సీఐడీ పోలీసులు పలువురిపై నమోదు చేసిన కేసులో హైకోర్టు విచారణ జరిపింది. సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. రాజధానిగా అమరావతి నిర్ణయించకముందే పలువురు భూములు కొనుగోలు చేశారని పేర్కొంటూ వెలగపూడి గ్రామానికి చెందిన సలివేంద్ర సురేశ్ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కె.శ్రీహాస, కె.రాజేశ్ , నార్త్ ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, సీహెచ్ తేజస్వీ, లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రి ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పై కేసు నమోదు చేశారు.
ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు చేశారు. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలొద్దని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సీఐడీ తరపున ఏజీ వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ పెద్దల సన్నిహితులు భూములు కొన్నారన్నారు. భూముల కొనుగోలు నిమిత్తం ప్రవాసాంధ్రులతో వాట్సాప్ మెసేజ్‌లు చేశారన్నారు. ఆ వివరాల్ని కోర్టుకు సమర్పించామన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తును కొనసాగనివ్వాలని కోర్టును కోరారు. ప్రాథమిక ఆధారాలున్న నేపథ్యంలోని సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరపాలని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ను ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : సీఎం జగన్‌పై 3 పిటిషన్లు: రెండింటిని కొట్టేసిన సుప్రీం