Mahapadayatra:ఎన్ని మైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో అమరావతి రైతులు తుళ్లూరులో చేపట్టిన మహాపాదయాత్ర కొండలు, గుట్టలు, వాగులు వంకలు దాటుకుని ఎండనక, వాననక సాగి తిరుపతి చేరింది. నిన్న తిరునగరిలో అన్నదాతలు మోగించిన అమరావతి నినాదానికి పుర ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మద్దతు పలికారు. రహదారి వెంబడి నిలబడి సంఘీభావం తెలుపుతూ ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జై అమరావతి అంటూ నినదించారు.
రైతుల 43వ రోజు మహాపాదయాత్ర రేణిగుంట నుంచి తిరుపతి నగరం మీదుగా తనపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న రామానాయుడు కల్యాణ మండపం వరకు కొనసాగింది. జనసందోహంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వైకాపా మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రైతులకు నీరాజనాలు పలికారు. రేణిగుంట వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణ రైతులకు సంఘీభావం తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గం తరఫున 12 లక్షల 69 వేల 999 రూపాయలను పాదయాత్రకు విరాళం అందించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రైతులతో కలిసి నడిచారు.
తిరుపతి నగరంలోకి ప్రవేశిస్తున్న సమయంలో తెలుగుదేశం నేతలతోపాటు స్థానికులు... రైతులకు, మహిళలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మహిళా రైతులందరికీ పూలహారం వేసి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సత్కరించారు. తిరుపతి నగర శివార్లలోకి పాదయాత్ర చేరుకునే సరికి స్థానికులు, రైతులతో దారి పొడువునా పాదయాత్రలో అమరావతి జెండాలు రెపరెపలాడాయి.
ఒకవైపు వర్షపు జల్లు... మరోవైపు పూల జల్లులతో రైతులు, మహిళలు తడిసి ముద్దయిపోయారు. పాదయాత్రకు మద్దతుగా తెలుగుదేశం నేత పులివర్తి నాని ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బెలూన్లతో వారికి స్వాగతం పలికి మీ వెంటే మేం ఉన్నామంటూ నినాదాలు చేశారు.
ఇవాళ రైతులు తిరుపతి నగరంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం అలిపిరి వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టడంతో మహాపాదయాత్రను ముగించనున్నారు. బుధవారం స్వామివారి దర్శనాలు చేసుకోనున్న రైతులు...... 17వ తేదీన అమరావతి ఆకాంక్షను చాటేలా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: