అమరావతిపై మాట తప్పిన జగన్‌ను దారికి తెచ్చే వరకూ పోరాటం ఆగదని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమం 800 రోజులకు చేరిన సందర్భంగా,.. వెలగపూడిలో చేపట్టిన 24 గంటల సామూహిక నిరాహార దీక్షను మహిళలు, రైతులు విరమించారు. తెదేపా, జనసేన, కాంగ్రెస్,సీపీఎం నాయకులు.. దీక్ష చేసిన వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
24 గంటల నిరాహార దీక్షలో భాగంగా రాత్రంతా దీక్షా శిబిరంలోనే నిద్రించిన మహిళలు.. తెల్లవారుజామునే జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం రైతుల ఆకాంక్షలను గౌరవించాలని కోరారు.
మహనీయుల స్ఫూర్తితో దీక్ష ..
‘అమరావతి ప్రజా దీక్ష’ పేరుతో వెలగపూడిలో సామూహిక నిరాహార దీక్షలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా.. సభావేదికకు ఓ వైపు ఆకుపచ్చని దుస్తులతో మహిళలు, మరోవైపు తెల్ల చొక్కాలు ధరించి పురుషులు దీక్షలో కూర్చున్నారు. అందరూ మెడలో ఆకుపచ్చ కండువాలు వేసుకున్నారు. ఉద్యమంలో అసువులు బాసిన వారికి, దీక్షాస్థలి వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, పొట్టి శ్రీరాములు చిత్రపటాల వద్ద నివాళులర్పించి దీక్షలను ప్రారంభించారు. అన్ని వర్గాలను ఉద్యమంలో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నందుకు చిహ్నంగా అంబేడ్కర్‌ను, 800 రోజులయినా బాపూజీ చూపిన శాంతి మార్గంలోనే ఉద్యమిస్తున్నందుకు గుర్తుగా గాంధీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీక్షలో దాదాపు 500 మందిపైగా పాల్గొన్నారు. ఐకాస నేతలు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభింపజేశారు. దీక్షలో ఉన్నవారికి మద్దతుగా రాజధానితో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఇదీ చదవండి:
Amravati movement: 'అమరావతి పోరు ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది'