గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు తమపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు(ANTICIPATORY BAIL) మంజూరు చేయాలని కోరుతూ అమరావతి దళిత ఐకాస నేత రైతు పులి చిన్నా, పులి వెంకయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ వద్దకు ఈ వ్యాజ్యం విచారణకు రాగా .. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ అభ్యర్ధన మేరకు బుధవారానికి వాయిదా పడింది.
వ్యాజ్యంలో ఏం కోరారంటే..
బొడ్రాయి కూడలి వద్ద తనపై పలువురు విచక్షణారహితంగా దాడి చేశారని పిటీషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. గాయాలతో ఠాణాకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పానన్నారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆసుపత్రికి వెళ్లగా..రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చి తన వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు. దాని ఆధారంగా ఈ నెల 18 న మొదట కేసు నమోదు చేశారని.. ఆ తర్వాత తమపైన కౌంటర్ కేసు పెట్టారన్నారు. అధికార వైకాపా నేతలు, ముఖ్యంగా ఎంపీ నందిగం సురేశ్ ప్రోద్భలంతో పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉడాలంటూ రైతులు చేస్తున్న కార్యక్రమాలకు అవాంతరాలు సృష్టించాలని, వారిని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతో ఎంపీ నందిగం సురేశ్ పలువుర్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. దాడులు చేయిస్తున్నారని వ్యాజ్యంలో తెలిపారు. అందులో భాగంగానే దాడులు, తప్పుడు కేసులు పెట్టారన్నారు. అమరావతి ఉద్యమం, తెదేపా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనకుండా మమ్మల్ని నిలువరించాలనే ఉద్దేశంతో కేసు పెట్టారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీతుసుకుని తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
ఇదీ చదవండి:
HC ON HOUSE TAX: మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను జీవోపై విచారణ