చంద్రబాబు అరెస్టు వార్త తెలిసిన వెంటనే.... అమరావతిలో మెరుపు వేగంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తాడికొండ, మేడికొండూరు తుళ్లూరులో రైతులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. ప్రభుత్వ, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట జరిగింది.
గుంటూరులోని అంబేడ్కర్ కూడలి వద్ద ఐకాస నేతలు నిరసన తెలిపారు. ఆ మార్గంలో వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఐకాస నేతలు విమర్శించారు.బాపట్ల గడియార స్తంభం వద్ద, జాతీయ రహదారిపై బైఠాయించి తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత అమరావతిలో... రోడ్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు.
విజయవాడలో నిరసనలు వెల్లువెత్తాయి. పైపులరోడ్డులో తెదేపా నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నందిగామలోని హైవేపై బైఠాయించి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో... మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతాయ్య ఇంటి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ స్తంభించటంతో పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు.
చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం నేతలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జాతీయరహదారిపై మంటలు వేసి నిరసన తెలిపారు. ప్రజలంతా కలసికట్టుగా ఉండి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేతలు పిలుపునిచ్చారు. తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్ గాంధీ విగ్రహం వద్ద...మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ధర్నాకు దిగారు. అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కర్నూలులో ఐటీసీ వద్ద జాతీయరహదారి దిగ్బంధనం చేశారు.
శ్రీకాకుళంజిల్లా ఏడురోడ్ల కూడలిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ధర్నా చేసిన తెదేపా శ్రేణులు..అనంతరం కాగడాల ర్యాలీ నిర్వహించారు.
ఇదీచదవండి