అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఉద్యమిస్తున్న రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించిన పోలీసులపై తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి ప్రకటించింది. రైతుల చేతికి బేడీలు వేసి అక్రమంగా అరెస్టు చేసిన పోలీసుల తీరును గర్హిస్తూ మూడు రోజులపాటు తాము ఇచ్చిన ఆందోళన పిలుపుపై ప్రభుత్వం భయపడిందని అన్నారు. అందుకే ఎక్కడికక్కడ రైతులు, నాయకులను నిర్భంధించి.. నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయించడం దుర్మార్గమని అమరావతి ఐకాస కన్వీనరు ఎ.శివారెడ్డి మండిపడ్డారు.
బేషరతుగా కేసులను ఉపసంహరించుకుని.. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోన్న మంగళగిరి, తుళ్లూరు డీఎస్పీలతోపాటు బాధ్యులైన పోలీసులపై తాము కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. మహిళలు, చిన్నారులపై పోలీసులు లాఠీలు ఝళిపించడం అప్రజాస్వామికమని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు అన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం