Amaravathi Farmers Protest on Theft :రాజధాని అమరావతిలోని అసెంబ్లీ పోలీసు కమాండ్ కంట్రోల్ రూంలో చోరీ జరిగినట్లు దళిత ఐకాస నేతలు ఆరోపించారు. విద్యుత్ సామగ్రి దొంగల పాలైందని వారు పేర్కొన్నారు. దళిత ఐకాస నేతలు, రైతులు ఆ భవనం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఫాల్స్ సీలింగ్ కింద పడిపోయిందన్నారు. గతంలో ఈ భవనం బ్రహ్మాండంగా ఉండేదని, ఇప్పుడు లోపలంతా ధ్వంసం చేశారని రాజధాని రైతు గాంధీ ఆరోపించారు. కంప్యూటర్లు, ఏసీలు, వైరింగ్ మొత్తం పోయాయని తెలిపారు. గతంలో తాను ఇక్కడ చూసిన సామగ్రిలో చాలావరకు లేదన్నారు. భవనంలో ఏసీలు నడిచే జనరేటర్లను పట్టుకెళ్లారని, టైల్స్ లేవని దొండపాడుకు చెందిన ముళ్లపూడి రవికుమార్ ఆరోపించారు. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే ప్రాంతంలో చోరీ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ‘కంకర, మట్టి చోరీపై గతంలో ఫిర్యాదు చేసినప్పుడు చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ చోరీ జరిగేదా? దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించి నిందితుల్ని పట్టుకోవాలి’ అని దళిత ఐకాస కన్వీనర్ మార్టిన్ లూథర్ డిమాండు చేశారు. అమరావతిలో దొంగతనాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని భాజపా నేత లంకా దినకర్ అన్నారు. అమరావతిలో దొంగతనాల వెనుక రాజధాని నిర్మాణ వ్యతిరేకులు ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అయితే, పోలీసులు మాత్రం ఆ భవనంలో ఎలాంటి దొంగతనం జరగలేదని, జరిగినట్లు ఫిర్యాదు అందలేదని తెలిపారు.
మా శాఖ సామగ్రి ఏదీ చోరీ కాలేదు...
అసెంబ్లీ వెనక నిర్మాణంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూంలో వస్తు, సామగ్రి చోరీకి గురయ్యాయని సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. అక్కడ పనులు నిర్వహించే కంపెనీల ప్రతినిధులను అడుగుదామంటే వారెవరూ అందుబాటులోకి రాలేదు. వారి నుంచి ఫిర్యాదు అందలేదు. పోలీసు కంట్రోల్‌రూంలో సీసీ కెమెరాలు, వైర్‌లెస్ సెట్లు మాత్రమే ఉన్నాయి. విద్యుత్‌సామగ్రి పోయిందనేది అవాస్తవం. మా శాఖకు చెందిన ఎలాంటి సామగ్రి చోరీ కాలేదు. కంట్రోల్ రూంలో 24 గంటలూ సిబ్బంది విధుల్లో ఉంటారు. చోరీకి ఆస్కారమే లేదు. గతంలో ఇసుక, ఇనుము చోరీలపై ఫిర్యాదు అందితే కేసులు నమోదు చేసి విచారిస్తున్నాం. శనివారం రాత్రి మందడం పరిసరాల్లో ఓ వ్యక్తి ఇనుప చువ్వలు కత్తిరించి ఆటోలో పట్టుకెళుతున్నారని స్థానికులు చెప్పగా వెంటనే పోలీసులను పంపాం. అతడు ఆటో వదిలి పరారయ్యాడు. వాటి విలువ సుమారు రూ.లక్షన్నర ఉంటుంది. రాజధాని ప్రాంతంలో గట్టి నిఘా ఉంచాం. ఊహాగానాలు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. - పోతురాజు, డీఎస్పీ, తుళ్లూరు
ఇదీ చదవండి : CPI Narayana on Union Government: కేసీఆర్‌లా జగన్ కూడా పోరాడాలి -సీపీఐ నారాయణ