రివర్స్ పాలన మాకొద్దంటూఅమరావతి రైతులు ప్లకార్డులు తల్లకిందులుగా పట్టుకుని నిరసన తెలిపారు. ఉద్ధండరాయునిపాలెంలో గ్రామ దేవతకు పొంగళ్లు సమర్పించారు. లింగాయపాలెంలో లలిత సహస్రనామ పారాయణం చేశారు. నీరుకొండ, తుళ్లూరు, బోరుపాలెం, పెదపరిమి, వెలగపూడి గ్రామాల్లో దీక్షలు కొనసాగాయి. రాయపూడిలో కృష్ణా పుష్కర ఘాట్ వద్ద రైతులు నీళ్లలో నిరసన తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ప్రతినిధులు రాజధాని గ్రామాల్లో పర్యటించి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. పెనుమాకలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరావతికి విఘ్నాలు తొలగాలని, రాజధాని సమరంలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కాంక్షిస్తూ మందడం శిబిరంలో సోమవారం హోమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
హస్తినకు పయనమైన రాజధాని రైతులు
రాజధానిపై వైకాపా సర్కారు తీరును దేశ రాజధాని దిల్లీ వేదికగా ఎండగడతామని అమరావతి ఐకాస మహిళా నాయకురాళ్లు పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసేందుకు ఆదివారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని జాతీయ నేతలకు వివరించి మద్దతు కోరతామని చెప్పారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన శంకుస్థాపనకు విలువ లేనప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇంకెవరిని గౌరవించాలంటూ ప్రశ్నిస్తామన్నారు. ఐకాస మహిళా నేతలు సుంకర పద్మశ్రీ(కాంగ్రెస్), అక్కినేని వనజ(సీపీఐ), మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(తెదేపా), రాయపాటి శైలజ, మహిళా రైతులు కంభంపాటి శిరీష, మువ్వ సుజాత, గుర్రం ప్రియాంక తదితరులు నేతృత్వం వహిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనాతో పెరిగిన గుడ్డు వినియోగం