రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన తరుణంలో అమరావతి ప్రాంత రైతులు రెండో దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కరోనా నేపథ్యంలో రైతులు తమ పోరాటాన్ని ఇళ్ల నుంచే చేస్తున్నారు. సెలక్ట్ కమిటీ పరిధిలో ఉన్న బిల్లులను ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపి ఆమోదింపజేసుకోవటంతో మళ్లీ రోడ్లపైకి వచ్చారు. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్దండరాయపాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లోని శిబిరాలు మళ్లీ తెరుచుకున్నాయి. రైతులు, మహిళలు వచ్చి తమ ఆందోళనలు కొనసాగించారు.
అమరావతి బిల్లులపై కోర్టులో విచారణ జరుగుతుండటం, సెలక్ట్ కమిటీ నుంచి ఎలాంటి నిర్ణయం లేకుండానే వాటిని గవర్నర్ ఆమోదించటాన్ని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు తప్పుబట్టారు. గవర్నర్ నిర్ణయం న్యాయసమీక్షలో వీగిపోతుందని విశ్వాసం వెలిబుచ్చారు. నిమ్మగడ్డ వ్యవహారాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. సరైన న్యాయ సలహాలు లేకుండా నిర్ణయం తీసుకుంటే ఇలాగే జరుగుతుందన్నారు.
తాము 8నెలలుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని రైతులు ఆగ్రహం వెలిబుచ్చారు. ఒకప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్... అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ఆలోచన ఎందుకు చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తమ గోడు పట్టించుకోని తరుణంలో రాజ్యాంగ వ్యవస్థలు తమని కాపాడతాయనే నమ్మకంతో ఉన్నామన్నారు. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ కూడా తమ గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆందోళనలు నిర్వహించారు. శిబిరాల్లో భౌతిక దూరం పాటించారు.
ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి... ఇపుడు వెన్నుపోటు పొడుస్తున్నారని అమరావతి దళిత ఐకాస మండిపడింది. తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో రాజధాని ఉండటం ఇష్టం లేకే మారుస్తున్నారని వారు ఆరోపించారు. ఒక సామాజికవర్గంపై ద్వేషంతో రాజధాని తరలించటం ఏ మేరకు న్యాయమన్నారు. రాజధాని పరిధిలోని ప్రతి గ్రామంలో ఎస్సీలే ఎక్కువగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పుడు సీఆర్డీయే రద్దు ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయింది కూడా ఎస్సీలేనని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నుంచి అంబేడ్కర్ స్మృతివనం తరలించి ఎస్సీల మనోభావాల్ని గాయపర్చారని విమర్శించారు.
రైతుల ఆందోళనలతో రాజధాని గ్రామాల్లో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఘర్షణ వాతావరణ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు దీక్షా శిబిరాలకు సమీపంలో మోహరించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఎక్కువమంది గుమికూడితే చర్యలు తప్పవని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి: కరోనాతో మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు కన్నుమూత