ప్రభుత్వం మెడలు వంచేలా అమరావతి రైతు ఉద్యమం కొనసాగనుందని ఆయా పార్టీల నేతలు, రాజధాని రైతు నాయకులు స్పష్టం చేశారు. కేంద్రం తలచుకుంటే రాజధానిగా అమరావతి ప్రకటన వెంటనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు ‘అమరావతి ప్రజా దీక్ష’ పేరుతో 24 గంటలపాటు చేపట్టిన సామూహిక నిరాహార దీక్ష శుక్రవారం ముగిసింది. గురువారం ఉదయం 9.45 గంటలనుంచి శుక్రవారం ఉదయం 9.45 వరకు దీక్ష చేశారు. దీక్షాపరులు గురువారం రాత్రి సభాప్రాంగణంలోనే నిద్రించారు.
ఆరింటినుంచే నినాదాలు...
శుక్రవారం తెల్లవారుజామున ఆరింటినుంచే నినాదాలు ప్రారంభించారు. 8గంటలనుంచి వివిధ పార్టీల నాయకులు, రాజధాని గ్రామాల రైతులు, మహిళలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. వివిధ పక్షాల నేతలు, ప్రజాసంఘాల నాయకులు దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు వివిధ పక్షాల నేతలు మాట్లాడారు. అమరావతి విషయంలో ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. ‘చంద్రబాబు అభివృద్ధిలో మొండిగా వెళితే.. జగన్ కక్షసాధింపులో మొండిగా ఉన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలు ఇదే చివరి ఛాన్స్ అని నిరూపించనున్నారు’ అని తెదేపా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ‘వైకాపాకు ఓటేసిన వారు కూడా అమరావతి పోరాటంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీట్లు వస్తే చాలని జగన్ ఆలోచిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలవారు అవసరం లేదని అనుకుంటున్నారు. కేంద్రంలోనూ మోసపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి’ అని ఆయన అన్నారు. ‘ఎన్నికల ముందు జగన్ అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారని చెప్పిన వైకాపా నేతలు అధికారం చేపట్టగానే వెన్నుపోటు పొడిచారు’ అని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు
జగన్ జీరో కావడం ఖాయం...
అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే జగన్ జీరో కావడం ఖాయమని వైకాపా నేత సుబ్బారావు గుప్తా విమర్శించారు. ‘వైకాపా ప్రజాప్రతినిధుల తీరు చూస్తే పోలీసులకే రక్షణ లేదా? అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసు చొక్కా పట్టుకుని ఓ మంత్రి నిలదీస్తే, ఓ ఎంపీ నేరుగా పోలీసుస్టేషన్‌కే వెళ్లి దబాయించారు. కొత్త డీజీపీ అయినా ఇలాంటివాటిని అరికట్టాలి’ అని సూచించారు. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశేనని జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్‌కు ఒక్క అవకాశమివ్వాలని కోరిన విజయమ్మ, షర్మిల ఇప్పుడు ఎక్కడున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రశ్నించారు.‘ఎన్నికల ముందు నేను విన్నాను.. నేనున్నాను అని చెప్పిన జగన్‌కు రైతుల ఆవేదన కనిపించడం లేదు.. వినిపించడం లేదు’ అని ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. 3 రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మద్దతిస్తోందని ఐద్వా ప్రధాన కార్యదర్శి రమాదేవి పేర్కొన్నారు. ‘రాష్ట్ర రాజధాని అమరావతే అని కేంద్రం చెబితే ముందడుగు వేసే ధైర్యం జగన్‌కు లేదు. జగన్ చెప్పింది చేసిన గౌతమ్ సవాంగ్ పోస్టు.. ఉద్యోగుల పోరాటంతోనే మారిపోయింది’ అని తెలిపారు. రైతులు, మహిళల నిరసన శుక్రవారం 801వ రోజు కొనసాగాయి.
ఇదీ చదవండి
Amravati movement: 'అమరావతి పోరు ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది'