Farmers padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర 35వ రోజు.. నెల్లూరు జిల్లా పుట్టంరాజు వారి కండ్రిగ నుంచి ప్రారంభమైంది. నేడు 15 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేయనున్న అన్నదాతలు.. రాత్రికి యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం
రైతుల పాదయాత్రలో పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. వారికి సంఘీభావం తెలిపారు.రాజధాని రైతులు చేసే పాదయాత్ర తమ స్వార్ధం కోసం కాదని ఆయన అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రానికంటూ ఒక రాజధాని ఉండాలంటూ స్పష్టం చేశారు. రాజధానిపై స్పష్టత ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు. ప్రస్తుతం నిరుద్యోగం పెరిగిపోతూ.. పెట్టుబడులు రాని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని అన్నారు. ప్రభుత్వం మళ్లీ తీసుకువస్తానంటున్న మూడు రాజధానుల బిల్లు ఎలా ఉంటుందో వేచి చూడాలన్న లక్ష్మీనారాయణ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నదే ప్రతి ఒక్కరి ధ్యేయమన్నారు. కావాలనుకుంటే ప్రభుత్వం శీతాకాల సమావేశాలు లాంటివి విశాఖ లేదా కర్నూలులో పెట్టుకోవాలని సూచించారు.
రాజధాని రైతుల మహాపాదయాత్రకు పాలయపల్లి వద్ద చెన్నై తెలుగుసంఘం ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. సాటి తెలుగువారు పడుతున్న కష్టాన్ని చూసి.. వారికి మద్దతు తెలిపేందుకు చెన్నైతో పాటు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 150 మంది మద్దతుగా వచ్చామని వెల్లడించారు. ఇప్పటికే చిన్నభిన్నమైనా రాష్ట్ర భవిష్యత్తు రేపటి తరం కోసమైనా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. తామంతా వివిధ ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ.. సాటి తెలుగువారికి జరుగుతున్న అన్యాయన్ని చూసి బాధపడుతున్నామన్నారు.
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా నందిగామ న్యాయస్థానం వద్ద నుంచి తిరుమలగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు అమరావతి రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఉదయాన్నే నందిగామలో ప్రారంభమైన యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది . పాదయాత్రకు అడుగడుగునా గ్రామాల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించడంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.
నందిగామకు చెందిన రాజధాని పరిరక్షణ సమితి సభ్యులు మన్యం శ్రీరామ్మూర్తి ,వైయస్ బాబు, సురేష్ తదితరులు పాదయాత్ర చేస్తున్నారు. వీరి పాదయాత్రకు నందిగామ మాజీ సర్పంచ్ శాఖమూరు స్వర్ణలతతో పాటు పలువురు మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తున్న వైయస్ బాబు మాట్లాడుతూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతుగా యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని కొనసాగే వరకు ఊరూరా పాదయాత్రలు నిరసన ప్రదర్శన చేయాలని కోరారు.
ఇదీ చదవండి: TTD CONTRACT EMPLOYEES PROTEST : తితిదే కార్మికుల నిరసన... సమస్యల పరిష్కారానికి డిమాండ్