రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తమ పోరాట పంథాలో మారో అడుగువేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా 685 రోజులు... వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు, మహిళలు మహా పాదయాత్ర ద్వారా తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరిట తలపెట్టిన పాదయాత్రను తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి ఈ ఉదయం 9గంటల ఐదు నిమిషాలకు ప్రారంభించారు.
సర్వమత ప్రార్థనలు...
అంతకుముందు మహా పాదయాత్ర విజయవంతంగా సాగాలని తుళ్లూరు దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కొనసాగాలని ప్రార్ధించారు. మహా పాదయాత్రకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఇది 29 గ్రామాల సమస్య కాదని.. 5కోట్ల ప్రజల జీవితాలు, రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యగా మహిళలు తెలిపారు. 13 జిల్లాల ప్రజలు తమ పోరాటానికి సంఘీభావం తెలిపుతున్నారని ఇందుకు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రకు వచ్చిన జనమే నిదర్శనమని అన్నారు.
వివిధ పార్టీ నేతల మద్దతు...
అమరావతి ప్రజల ఆకాంక్షకు వివిధ పార్టీల నేతలు మద్దతు పలికారు. రైతులు, మహిళలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేతలు దేవినేని ఉమా, ప్రతిపాటి పుల్లరావు, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి ఏకైక రాజధాని కోనసాగేవరకు తమ మద్దతు సాగుతుందని నేతలు తెలిపారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగనుంది. తొలిరోజు తుళ్లూరు నుంచి పెదపరిమి మీదుగా తాడికొండ వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. రోజుకి 10 నుంచి 15 కిలోమీటర్ల మేర అమరావతి రైతులు నడవనున్నారు.
ఇవీచదవండి