అలుపెరగకుండా సాగుతున్న రాజధాని రైతుల న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర (amaravathi farmers news) 26వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా రాజుపాలెం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు. రాజ్యాంగం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌కు నివాళలర్పించి పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని అమరావతి విషయంలో రాజ్యాంగబద్ధంగా న్యాయం జరగాలని రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మారి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆకాంక్షించారు. నేడు 15 కిలోమీటర్ల మేర రైతుల మహాపాదయాత్ర సాగనుంది.
జనసేన మద్దతు..
రైతుల మహాపాదయాత్రకు కోవూరు వద్ద జనసేన రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఇంటి పక్కనున్న రైతులకు న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికి ఏం చేస్తారని నాదెండ్ల ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా ఉండాలన్నదే జనసేన సంకల్పమని స్పష్టం చేశారు. రివర్స్ పాలన తరహాలో రివర్స్ బిల్లుల సంస్కృతి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది..
కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి మాహాపాదయాత్రలో పాల్గొని రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పకోలేని పరిస్థితి రావటం బాధాకరమన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమేనన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాదయాత్ర చేస్తున్న మహిళలకు జిల్లా నేతన్నలు చీరలు పెట్టి తమ మద్దతు తెలిపారు. నేతన్నలు పంచిన చీరలను వరద ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులకు తిరిగి పంచిపెట్టారు. కోవూరులోని కనకమహాలక్ష్మీ మల్లిఖార్జున దేవాలయంలో అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ స్థానికులు కోటీ లక్షా పదహారు వేల దీపాలు వెలిగించారు. భాజపా, సీపీఐ, సీపీఎం, ఐద్వాతో పాటు వివిధ ప్రజా సంఘాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రైతులకు మద్దతు తెలిపి జై అమరావతి అని నినదించారు.
45 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగనుండగా..డిసెంబరు 15న తిరుమలకు చేరుకునేలా అమరావతి ఐకాస నేతలు ప్రణాళిక రూపొందించారు.
ఇదీ చదవండి: padayatra: అమరావతి రైతులకు అపూర్వ స్వాగతం.. ఉత్సాహంతో సాగిన పాదయాత్ర