రాజధాని అమరావతిని కొనసాగించాలని.... మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపంసహరించుకోవాలంటూ రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న ఆందోళనలు 253వ రోజూ కొనసాగాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, పెదపరిమిలో ధర్నాలు నిర్వహించారు. కొందరు రైతులు వార్షిక కౌలు కోసం విజయవాడ ఏఎంఆర్డీఏ కార్యాలయానికి వెళ్లగా... పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై రైతులు, మహిళలు భగ్గుమన్నారు. తుళ్లూరు ధర్నా శిబిరం వద్ద మోకాళ్లపై నిల్చొని ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. భూములు తీసుకుని కౌలు ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో ఉపాధి సంగతేమిటని రైతులు ప్రశ్నించారు. ఓవైపు కరోనా మరోవైపు ఉపాధి కరవైనప్పుడు తమ పిల్లల్ని ఎలా పోషించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు కోసం శాంతియుతంగా వెళ్తే అరెస్టులు చేయడమేంటన్న రైతులు, మహిళలు... ప్రభుత్వం తరచూ తమను వేధిస్తోందని తమ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు.
ఓ పార్టీపై ద్వేషంతోనే
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజా తీర్పుపై రాజధాని రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. హైకోర్టులో విచారణ పెండింగులో ఉండగానే సుప్రీంకోర్టుకు ఆదరాబాదరాగా వెళ్లడం, రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడాన్ని రైతులు, మహిళలు గుర్తు చేశారు. ఆనాడే రాజధానిగా అమరావతిని జగన్ మోహన్ రెడ్డి అంగీకరించకుండా ఉండాల్సిందని అలాగైతే అందరి రైతులు తమ భూములు ఇచ్చేవారు కాదన్నారు. ఓ వ్యక్తి, ఓ పార్టీపైన ద్వేషాన్ని రైతులపై చూపించడం ప్రభుత్వానికి తగదన్నారు. ఎవరు అభివృద్ధి చూసినా స్వాగతించాలేగాని అడ్డుకోవడం తగదని రైతులు, మహిళలు హితవు పలికారు.
విజయవాడలో కౌలు కోసం వెళ్లి అరెస్టైన రైతులు, మహిళలు శిబిరాలకు చేరుకోగా వారిని సాదరంగా ఆహ్వానించారు. వారికి కుంకుమదిద్ది శిబిరాల్లోకి స్వాగతించారు.
ఇదీ చదవండి : 'అంబటి రాంబాబు అక్రమ మైనింగ్': హైకోర్టులో పిటిషన్