పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని గ్రామాల్లో 275వ రోజు రైతులు ఆందోళనకు కొనసాగించారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు వినూత్న రీతిలో నిరసనలను తెలియజేశారు. తాళ్లాయపాలెం పుష్కరఘాట్ లో ఉద్ధండరాయునిపాలెం రైతులు నల్లబెలూన్ లు ఎగురవేశారు. కృష్ణానదిలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. అమరావతి ఉద్యమానికి కృష్ణమ్మ అండగా ఉండాలని సారె సమర్పించారు.
వెలగపూడిలో రైతులు నల్ల రిబ్బన్లు కట్టుకొని మానవహారం చేశారు. ఈ ప్రభుత్వం కళ్లుండి తమ బాధలు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ నల్ల రిబ్బన్లు ధరించామని రైతులు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో అమరావతిలో భూకుంభకోణాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ సర్కార్ కళ్లు తెరిచి చూడాలని రైతులు విన్నవించారు.
కృష్ణాయపాలెంలో రైతులు వినూత్న రీతిలో నిరసనను తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ, కర్నూలుగా రాజధానిని విభజించినా.... రైతుల ఉద్యమం అందర్ని అమరావతివైపే నడిపిస్తోందంటూ చేసిన స్కిట్ అలరించింది. తుళ్లూరులో అన్నదాత ఆవేదన పేరుతో చేసిన స్కిట్ అందర్నీ అలోచింపచేసింది. 'అమరావతి రైతు దగ్గర్నుంచి అన్నం లాక్కొని విశాఖ, కర్నూలు రైతులకు ముఖ్యమంత్రి జగన్ పెడుతుంటే.. అది తమకు వద్దని అమరావతి రైతుకే అందించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. అయినా వినకుండా మొండిగా ప్రవర్తించడంతో చివరకు న్యాయస్థానం కల్పించుకొని అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటిస్తుంది.' రైతులు చేసిన ఈ నాటకం అందర్ని ఆలోచింపచేసింది.
మందడంలో రైతులు ప్రధాని మోదీ మాస్క్ ధరించి నినాదాలు చేశారు. మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన మాస్క్ ధరించిన వ్యక్తికి శాలువా కప్పి సన్మానం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ మహిళలు మోదీ మాస్క్ ధరించిన వ్యక్తికి విన్నవించారు. తమ ఉద్యమానికి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా మొక్కోవని దీక్షతో అమరావతిని సాధించుకునేంతవరకు ఆందోళనకు కొనసాగిస్తామని రైతులు తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: సరిహద్దులో చైనా కొత్త నిర్మాణాలు- నేపాల్ వత్తాసు!