హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ మూడో రోజు కస్టడీ బుధవారం ముగిసింది. గురువారం మధ్యాహ్నం ఆమెను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ లోపు ఆమె నుంచి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొదట పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు అఖిలప్రియ దాటవేత ధోరణి అవలంబించినట్లు తెలిసింది. అపహరణ కేసులో సేకరించిన సాంకేతిక ఆధారాలను ఆమె ముందుంచటంతో కొన్నింటిని ఒప్పుకున్నట్లు సమాచారం. హఫీజ్ పేటలోని 25 ఎకరాల భూమికి సంబంధించి ప్రవీణ్‌రావు సోదరులతో చర్చించడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్లు నిరాకరించినట్లు పోలీసుల వద్ద ఆమె తెలిపినట్లు సమాచారం. అఖిలప్రియ చెప్పిన సమాచారంతో పోలీసులు పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.
స్కెచ్ ఇలా వేశారు!
'హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ఎంజీఎం స్కూల్లో కిడ్నాపర్లతో భార్గవ్, చంద్రహాస్ భేటీ అయ్యారు. అక్కడ ఓ సినిమా చూపించి కిడ్నాప్‌నకు భార్గవ్ పథకం రచించారు. అలాగే కిడ్నాప్ సమయంలో బోయిన్‌పల్లి వరకు ఆయన కారులో వెళ్లారు. ఘటన తర్వాత భార్గవ్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. ప్రవీణ్ రావు, నవీన్‌తో అతను సంతకాలు చేయించారు' అని పోలీసులు తెలిపారు.
ముమ్మర గాలింపు
పరారీలో ఉన్న భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను, జగద్విఖ్యాత్ రెడ్డితో పాటు మిగతా నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వీళ్లను అదుపులోకి తీసుకుంటే అపహరణ కేసులో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: యాప్‌లో డబ్బులు పెట్టాడు.. రైలు కింద తల పెట్టాడు!