నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో 4,91,316 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. అధికారులు డిసెంబర్ పదో తేదీ నాటికి అంచనాలు సిద్ధంచేసి, నెలాఖరులోగా పరిహారం అందించాలని ఆదేశించారు. తుపాను నష్టంపై ఆయన శనివారం కాకినాడ నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న, ఏపీ సీడ్ ఎండీ శేఖర్‌బాబు, జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చూడాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
* రెండు, మూడు రోజుల్లో మరో వాయుగుండం వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరిస్తున్నందున పుర, నగరపాలక సంస్థల కమిషనర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. శనివారం ఆయన విజయవాడ నుంచి పుర, నగరపాలక సంస్థల కమిషనర్లతో దృశ్యమాధ్యమ సమీక్షించారు. వ్యాధులు ప్రబలకుండా చూడాలని, మంచినీటి చెరువులకు గండ్లు పడకుండా పర్యవేక్షణ ఉండాలని అన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలపై ప్రత్యేకశ్రద్ధ చూపాలన్నారు.
అన్ని జిల్లాల్లో పెనునష్టం
తూర్పుగోదావరి జిల్లాలో 38,278.3 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 35,193.3 హెక్టార్లలో వరి, 663.61 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 24 గంటల్లో జిల్లాలో 25.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా రైతులు నష్ట నివారణ చర్యల్లో నిమగ్నమయ్యారు. పొలాల్లో నీరు తొలగించే ప్రయత్నాలు చేశారు. శుక్రవారం సగటు వర్షపాతం 10.6 మి.మీ. నమోదైంది. వరి, పత్తి, మినుము, పొగాకుకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో ఆరుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. వాగుల ప్రవాహ ఉద్ధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే రాకపోకలు ప్రారంభమయ్యాయి. రహదారులు, భవనాల శాఖ పరిధిలోని రోడ్ల శాశ్వత మరమ్మతులకు రూ.140 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. గురువారం 4,012 మంది పునరావాస కేంద్రాల్లో ఉండగా.. శనివారం ఉదయానికి 240 మందే ఉన్నారు. గుంటూరు జిల్లాలో వరి రైతులకు అంతులేని నష్టం వాటిల్లింది. కొందరు రైతులు కట్టలు కట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పల్నాడులో మిర్చి ఉరకెత్తి దెబ్బతింది. పెదనందిపాడు, ప్రత్తిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల్లో ఎగువ నుంచి వాగుల ద్వారా వచ్చిన వర్షపునీరు వెళ్లే మార్గం లేక.. పొలాలను ముంచెత్తింది. కర్నూలు జిల్లాలో శనివారం సగటున 17.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. 27 మండలాల్లో అరటి, పసుపు, మిర్చి, కూరగాయల పంటలు నీట మునిగి రూ.15.56 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. పలు మండలాల్లో గొర్రెలు మృతి చెందాయి.
కోలుకోని సింహపురి
తుపాను ప్రభావం నుంచి సింహపురి ఇంకా కోలుకోలేదు. అనేక ప్రాంతాలు శనివారమూ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సంగం, నెల్లూరు, ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది. సంగం వద్ద నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపైకి వరదనీరు రావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నా నదికి ఇన్‌ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో అవుట్‌ఫ్లో అదే స్థాయికి చేర్చారు. పలుప్రాంతాల్లో రొయ్యల చెరువులు నీటమునిగాయి. కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. పొర్లుకట్ట ప్రాంతంలో వరద నీటిలో ఇళ్లలో సామగ్రి కొట్టుకుపోయాయి. వెంకటేశ్వరపురంలో బియ్యం, సరకులు తడిసిపోవడంతో.. ఆహార పొట్లాల కోసం ఎదురుచూస్తున్నారు. జయలలిత కాలనీ, అరవపాళెం, మనుమసిద్ధినగర్ ప్రాంతాల్లో బాధితులను సహాయక శిబిరాలకు తరలించారు. చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పర్యటించారు. సంగం మండలం వీర్లగుడిపాడుకు నాటు పడవపై తెడ్డు వేసి నడుపుకొంటూ వెళ్లారు. కచదేవరాయపల్లిలో బాధితులను పరామర్శించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి విడవలూరు మండలం ఊటుకూరు, పల్లిపాళెంలో పర్యటిస్తుండగా వరదనీటిలో చిక్కుకున్నారు. పోలీసులు ఆయన్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య
నీట మునిగిన పంటను చూసి.. మనస్తాపానికి గురైన కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణాజిల్లా చల్లపల్లిలో శనివారం జరిగింది. గద్వాలు కృష్ణ (46) పదెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశారు. పంట నీట మునగడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: