ఇంటింటి రేషన్ పంపిణీకి సంబంధించిన మెుబైల్ వాహనాలకు రంగులు మార్చాలంటే.. రెండు నెలల సమయం పడుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. రంగులు మార్చేందుకు ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన విధంగా వాహనాల రంగులు మార్చటం సాధ్యం కాదన్నారు. మంగళవారం ఏజీ వాదనలు ముగియటంతో.. ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదనల కోసం కేసు బుధవారానికి వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
వైకాపా రంగులతో పోలి ఉన్న మెుబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కుదరదనీ.. తటస్థ రంగులేసి తమ పరిశీలనకు తీసుకురావాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈనెల 5న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కె శశిధర్ హైకోర్టును ఆశ్రయించారు.
మెుబైల్ వాహనాలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రాకముందే ప్రారంభించినట్లు ఏజీ వాదనలు వినిపించారు. ఇది కొత్త పథకం కాదనీ.. గతంలో ఉన్న పథకానికి కొనసాగింపు మాత్రమే అని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. వాహనాలపై అధికార పార్టీ రంగులు లేవన్నారు. ప్రభుత్వ పథకాల ప్రకటనల్లో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల బొమ్మలు ఉండవచ్చునని.. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల కారణంగా పేద ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించే పథకాన్ని నిలువరించటం సరికాదన్నారు. పథకం అమలుకు ఆదేశాలు ఇవ్వాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు.
ఇంటింటికీ రేషన్ పంపిణీ ఆవశ్యకతను వివరించినా.. ఎస్ఈసీ పరిణగనలోకి తీసుకోలేదని.. ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లబ్ధిదారులకు రేషన్ అందించటం రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత అని అన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో పథక అమలుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.