పురపాలక సంఘాల్లోని ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ప్రతిభావంతులను ఏఎఫ్‌సీ పాఠశాలలో చేర్పించి జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీలకు సరిపడే సిలబస్‌ను ప్రత్యేక మెటీరియల్స్‌తో శిక్షణ ఇచ్చేవారు. వారంతపు, నెలవారి పరీక్షలు నిర్వహించి కార్పొరేట్ పాఠశాలల తరహాలో ర్యాంకులు ఇచ్చేవారు. దీంతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి చదువులో బాగా రాణించారు. జిల్లాలో విజయవాడ, గుడివాడలో రెండు పాఠశాలలను ఏర్పాటు చేశారు. ప్రతి సెక్షన్‌కు 30 మంది చొప్పున 150 మంది విద్యార్థులను ఏటా చేర్చుకున్నారు. ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించి ప్రత్యేక సిలబస్‌ను బోధించేవారు. ప్రత్యేక చర్యల వల్ల పదో తరగతి విద్యార్థులు పది జీపీఏలతో రాణించారు.
● 2016-17 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో పదికి పది జీపీఏను కేవలం 55 మంది సాధించారు. ఫౌండేషన్ కోర్సు, స్పార్క్ ప్రోగ్రామ్ అమలుతో 2017-18లో 302 మంది, 2018-19లో 403 మంది పది జీపీఏ సాధించారు.
జిల్లాలో 61 మందికి పది జీపీఏ
జిల్లాలోని రెండు ఏఎఫ్‌సీ పాఠశాలల్లో గత మూడేళ్లలో 61 మంది పదికి పది జీపీఏ సాధించారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాలకు 108 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ట్రిపుల్ ఐటీలకు 69 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
ఉదాసీన వైఖరిలో ప్రభుత్వం
తల్లిదండ్రుల ఆదరణ చూరగొన్న ఏఎఫ్‌సీ పాఠశాలలపై నూతన ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. గతేడాది ప్రత్యేక మెటీరియల్, ర్యాంకులు ఇవ్వలేదు. వారాంతపు పరీక్షలు నిర్వహించలేదు. ఈ పాఠశాలను కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు చేసి, పురపాలకశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అయినా పురపాలకశాఖ తల్లిదండ్రుల మొర ఆలకించలేదు.
మాతృ పాఠశాలలకు వెళ్లాలని ఆదేశాలు
పురపాలకశాఖ ఇటీవల ఏఎఫ్‌సీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను మాతృ పాఠశాలలకు వెళ్లాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులంతా తమ మాతృ పాఠశాలల్లో చేరిపోయారు. వేలాది మంది విద్యార్ధుల తల్లిదండ్రులు ఏఎఫ్‌సీ పాఠశాలలను కొనసాగించాలని కోరుతున్నారు.
కొవిడ్ కారణంగానే మూత
కొవిడ్-19 కారణాలతో ఏఎఫ్‌సీ పాఠశాలలను కొనసాగించలేమని రాష్ట్ర పురపాలక విద్యాశాఖ ప్రత్యేకాధికారి గోపీనాథ్ తెలిపారు. కరోనా వల్ల రోజువారి, వారానికోసారి అదనపు తరగతుల నిర్వహణకు విఘాతం ఏర్పడుతుందని చెప్పారు. అందువల్లనే ఏఎఫ్‌సీ స్కూల్స్ ఈ ఏడాది మూసివేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం అవకాశం ఉందా అని ప్రశ్నించగా తానేమీ చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సావన్ మాసం ముగింపు- శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు