అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గం ప్రకటన విడుదల చేసింది. రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించారు. రజనీకాంత్‌కు తోడుగా ఆయన కుమార్తె ఉన్నారని చెప్పారు. తలైవాను పరామర్శించేందుకు, ఆరోగ్య పరిస్థితిపై వాకబు కోసం ఎవరినీ అనుమతించట్లేదని పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం మరోసారి రజనీకి కొవిడ్ నిర్ధరణ పరీక్షలతో పాటు.. గుండె సంబంధిత పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ఆ నివేదికలు వచ్చిన తర్వాతనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
తలైవా త్వరగా కోలుకోవాలి: ప్రముఖుల ఆకాంక్ష
రజనీకాంత్ అస్వస్థతకు గురికావడంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వాకబు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్, మోహన్ బాబు, మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. రజనీ మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తని, త్వరగా కోలుకొని పనులు మొదలుపెడతారని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.