Actor Naresh About His Wife : రమ్యరఘుపతి జరిపే వ్యాపార, ఆర్థిక వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని 'మా' మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు నరేశ్ స్పష్టంచేశారు. వివాహ జీవితంలో ఇద్దరి మధ్య స్పర్థలు తలెత్తడంతో ఐదారేళ్లుగా దూరంగా ఉన్నట్టు చెప్పారు. తమ పెళ్లి తరువాత ఇటువంటి వ్యవహారాలు చేస్తున్న ఆమె వల్ల ఇబ్బందులతోనే దూరమయ్యామన్నారు. ఇటువంటి సంఘటనలు మనోవేదనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారికి సొమ్ములిచ్చి సర్దుబాటు చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.
"రమ్యరఘుపతి గురించి మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. అవి చూసి చాలా మంది నాకు ఫోన్ చేశారు. నేను ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నాను. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దాదాపు ఆరేళ్ల నుంచి మేం దూరంగా ఉంటున్నాం. వేర్వేరుగా.. ఎవరి బతుకు వాళ్లం బతుకుతున్నాం. ఇప్పుటు ఆమె వ్యాపార లావాదేవీలు, అప్పుల సమస్యల గురించి వస్తున్న వార్తల్లో నా భాగస్వామ్యం ఏం లేదు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మూణ్నెళ్ల క్రితమే పబ్లిక్ నోటీసు ఇచ్చాను. రమ్యరఘుపతితో.. నాకు నా కుటుంబానికి నా బంధువులకు ఎలాంటి సంబంధం లేదని కొద్దిరోజుల క్రితమే.. నేను పేపర్‌లో ప్రకటన కూడా ఇచ్చాను.
- నరేశ్, సీనియర్ నటుడు
అసలేం జరిగిందంటే..
Actor Naresh About His Wife Ramya Raghupathi : రమ్య రఘుపతి రూ.లక్షల్లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించట్లేదంటూ బాధితులు మంగళవారం రోజున గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంభ ఉన్నతి అరోమా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు రమ్యరఘుపతి చాలా మంది నుంచి అప్పులు తీసుకుంటోంది. 20 శాతం వడ్డీ ఇస్తానంటూ 2019 నుంచి నానక్‌రాంగూడ, చిత్రపురికాలనీ, మదీనాగూడ, బీరంగూడ తదితర ప్రాంతాల్లోని ఒక్కొక్కరి నుంచి రూ.5-20 లక్షల వరకూ సంస్థ పేరుతో అప్పులు తీసుకుంది. తీసుకున్న అప్పుల్లో కొంతమాత్రమే తిరిగి చెల్లిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు, వడ్డీ తిరిగి చెల్లించట్లేదంటూ మదీనాగూడకు చెందిన రమ్య, గచ్చిబౌలి శ్రీనాథ్ వాసం, మదీనగూడ వాసి సునీత, మాదాపూర్ నివాసి పి.లక్ష్మినారాయణ ఫిర్యాదు చేశారు. సంస్థ పేరుతో రమ్య రఘుపతి ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయినట్టు వివరించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.