విక్రయానికి అనువైన ప్రభుత్వ భూముల వివరాల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. తొలి విడతలో విశాఖ, గుంటూరు నగరాల్లో కలిపి తొమ్మిది చోట్ల ప్రభుత్వ భూముల విక్రయానికి నోటిఫికేషన్ వెలువడింది. మలివిడతలో మరికొన్ని ప్రభుత్వ భూముల విక్రయానికి నోటిఫికేషన్ త్వరలో రానుంది. ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయించిన తొలినాళ్లలో రూ.20 వేల కోట్ల విలువైన 5వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు అంచనా వేశారు. క్షేత్రస్థాయి పరిశీలనలో 1400 ఎకరాల భూమి మాత్రమే అనువుగా ఉందని గుర్తించారు. వీటిని విక్రయిస్తే రూ.10వేల కోట్ల ఆదాయం రావొచ్చని ప్రభుత్వ అంచనా. పూర్తి అధ్యయనం తరువాత ఈ అంచనాల్లోనూ మార్పులుండవచ్చని భావిస్తున్నారు.
చాలాచోట్ల వివాదాల్లో ఉన్నవి, తక్షణ అవసరాలను తీర్చలేని భూములున్నాయని గుర్తించారు. ఉచిత నివాస స్థలాల పంపిణీకి ప్రభుత్వ భూమి అవసరం కావడంతో విక్రయ జాబితా నుంచి పలు స్థలాలను తప్పించారు. చాలాచోట్ల భూవిక్రయానికి అక్కడున్న విద్యుత్ హైటెన్షన్ తీగలు అడ్డుగా మారాయి. మరోవైపు కొన్ని జిల్లాల్లో పట్టణాలు, నగరాల మధ్యలో ఉన్న జైళ్లను శివార్లలోకి తరలించి భూములను విక్రయించాలని యోచిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో ఇలాంటి ప్రతిపాదన ఉంది. తర్జనభర్జనల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత కింద 20 చోట్ల స్థలాలను విక్రయించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. చివరకు 9చోట్ల విక్రయించేందుకు ప్రకటన వెలువడింది. మలివిడతలో ఉభయగోదావరి జిల్లాల్లో 40 స్థలాల అమ్మకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తున్నారు. విక్రయానికి గుర్తించిన ప్రభుత్వ భూములపై ఆయా శాఖలు అభ్యంతరాలు చెబుతూ పునఃపరిశీలనకు విన్నవిస్తున్నాయి.
ఇదీ చదవండి: