ev charging centres in ap: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు దిల్లీ, గుజరాత్‌లకు చెందిన టైరెక్స్, స్టాటిక్ సంస్థలు ఆసక్తి చూపాయి. జనవరి నాటికి ఈ రెండు సంస్థలు కలిసి కనీసం వంద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ సంస్థలతో నెడ్‌క్యాప్ కొద్ది రోజుల్లో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల నెడ్‌క్యాప్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఈవోఐ) జారీ చేసింది. దీనికి స్పందించిన పలు సంస్థలతో సంప్రదింపుల తర్వాత రెండు సంస్థలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
nedcap: ప్రధాన నగరాల్లో.. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి వీలుగా ప్రతి 3 కి.మీలకు ఒక ఛార్జింగ్ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని నెడ్‌క్యాప్ నిర్ణయించింది. తొలుత విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేస్తారు. అనంతరం దశల వారీగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నారు. తక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాల ధర రూ.50-60 వేల లోపు ఉంటుంది. ఈ శ్రేణి వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉందని అధికారుల అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరాల పరిధిలో ఎక్కువ సంఖ్యలో ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నెడ్‌క్యాప్ నిర్ణయించింది.
ev charging centres: ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన వారికి యూనిట్‌కు రూ.2.50 వంతున చెల్లిస్తామని టైరెక్స్, స్టాటిక్ సంస్థలు ప్రతిపాదించాయి. ప్రస్తుతం ఛార్జింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్న సంస్థలు 50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నాయి. అందుకే అద్దె మొత్తాన్ని పెంచడం ద్వారా స్థలాల యజమానులను ఆకర్షించాలన్నదే అధికారుల ఆలోచన. ఛార్జింగ్ కేంద్రాల్లో వినియోగించే విద్యుత్‌కు యూనిట్ రూ.6 వంతున ఛార్జీల రూపేణా ప్రభుత్వం తీసుకుంటోంది. వాహనదారుల నుంచి యూనిట్‌కు రూ.12 వంతున నిర్వాహకులు వసూలు చేస్తారు. ఈ లెక్కన చూసినా నిర్వాహకులకు యూనిట్‌కు రూ.3.50 మిగులుతుందని ఓ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి:
7 DIED IN ROAD ACCIDENT: ఏడుగురిని మింగేసిన రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి..