5G SERVICES: ప్రస్తుత 4జీ సేవలతో పోలిస్తే 10 రెట్ల వేగంతో డేటా బదిలీకి వీలున్న 5జీ సేవలు అక్టోబరులో ప్రారంభమవుతాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. టెలికాం సేవల ఛార్జీలు ప్రపంచంలోనే మన దగ్గర చౌక అని, 5జీ ఛార్జీలు కూడా అందుబాటులోనే ఉంటాయని పరిశ్రమ భరోసా ఇచ్చిందని వివరించారు. తొలుత హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, లఖ్‌నవూ, పుణెలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగరాల్లో కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే తొలుత 5జీ సేవలు లభిస్తాయి. రెండు, మూడేళ్లలో దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనున్నాయని మంత్రి చెప్పారు.
శరవేగంగా స్పెక్ట్రమ్ కేటాయింపు
5జీ సేవల కోసం దాదాపు రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను సంస్థలు కొనుగోలు చేశాయి. తొలి వాయిదా జమచేసిన 24 గంటల్లోపే స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించేశారు. ఈ నెలలోనే వాణిజ్య సేవలకు శ్రీకారం చుడతామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. జియో కూడా 1000 పట్టణాలు, నగరాల్లో ఏర్పాట్లు సిద్ధం చేశామంది. ఈ సేవలకు కీలకమైన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అన్నది చూడాల్సి ఉంది.
ఫైబర్‌తో అనుసంధానించాలి
5జీ స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే టెలికాం టవర్లలో కనీసం 70 శాతాన్ని ఫైబర్‌తో అనుసంధానించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం 33 శాతం టవర్లనే ఫైబర్‌తో కలిపారు. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలు తొలుత మెట్రోలతో పాటు అధిక చెల్లింపు/వినియోగ సామర్థ్యం ఉన్న నగరాలకే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చి, క్రమంగా విస్తరిస్తాయని అంటున్నారు. 2జీ, 3జీ సేవలను ఒకే నెట్‌వర్క్‌పై వేర్వేరు సంస్థలు ఇవ్వగలవు. అయితే అధిక డేటా వినియోగం వల్ల 5జీలో అలా కుదరదు. దేశీయంగా 5జీ స్పెక్ట్రమ్ పొందిన 3 సంస్థలు కలిసి 2025 కల్లా కనీసం 30.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.42 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని యూబీఎస్ సంస్థ అంచనా వేసింది. ప్రతి చదరపు కిలోమీటరుకు 500 చిన్న సెల్ డిప్లాయ్‌మెంట్స్ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉన్నందున, మొత్తంమీద రూ.5-7 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయనే అంచనాలున్నాయి.
పరికరాలున్నాయా?
5జీ వ్యవస్థలో ఆప్టికల్ ఫైబర్, సెమీ కండక్టర్ ఆధారిత పరికరాలు కీలకం. దేశీయంగా తయారవుతుండగా, చైనా, దక్షిణకొరియా, ఇండోనేసియా నుంచీ భారీగానే దిగుమతి అవుతున్నాయి. దేశీయంగా రూపొందించిన 5జీఐ సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలైన 3 జీపీపీ కి అనుగుణంగా 5జీ సేవలు అందించాల్సి ఉంది. 5జీఐని ఐఐటీ చెన్నై- హైదరాబాద్, టీఎస్‌డీఎస్‌ఐ, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీ సమన్వయంతో అభివృద్ధి చేశాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సేవలు లభించేలా చూడటమే మన సాంకేతికత లక్ష్యం.
భారీగా బేస్ స్టేషన్ల అవసరం లేకుండా..
తక్కువ బేస్ స్టేషన్లతోనే ఎక్కువ విస్తీర్ణంలో 5జీ సేవలు అందించేలా చేయడమే 5జీఐ ప్రత్యేకత. లో మొబిలిటీ లార్జ్ సెల్ ఇందుకు ఉపకరిస్తుంది. ఇది టెలికాం నెట్‌వర్క్ సంస్థలకు కలిసి వచ్చే అంశం. 3జీపీపీ కి అనుగుణంగా సేవలుంటేనే, దేశీయ-అంతర్జాతీయ సర్వీసుల మధ్య తేడా లేకుండా ఉంటుంది. ప్రస్తుతం తయారవుతున్న 5జీ ఫోన్లన్నీ 3జీపీపీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవే. టెలికాం సంస్థల హార్డ్‌వేర్ పరికరాలు కూడా అందుకనుగుణమైనవే కావడం గమనార్హం. 5జీ సేవల అమలులో ఇదే కీలకాంశంగా మారబోతోంది.
ఇప్పటికే 5 కోట్ల ఫోన్లు సిద్ధం
ఇప్పటికే దేశంలో 5జీ సేవలకు అనువైన స్మార్ట్‌ఫోన్లు 5 కోట్లకు పైగా విక్రయమయ్యాయని మార్కెట్ పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. 4జీ సేవలను సమర్థంగా వాడుకోవాలంటే కనీసం రూ.15,000 విలువైన 4జీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్లతోనే సాధ్యమవుతోంది. 5జీ ఫోన్లు కూడా ఇవే ధరల శ్రేణిలో లభ్యమవుతున్నాయి. జియో సంస్థ సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10-12 వేల శ్రేణి నుంచి ఆవిష్కరిస్తుందనే వార్తలొస్తున్నాయి. ఆగస్టు 29న నిర్వహించే రిలయన్స్ ఇండస్ట్రీస్ సాధారణ సర్వసభ్య సమావేశంలో జియో 5జీ సేవల ఆరంభం, ఫోన్‌పై స్పష్టమైన ప్రకటన రావచ్చు.
ఛార్జీలు ఎంతుంటాయో!
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 70 దేశాల్లో 5జీ సేవలు అమల్లోకి వచ్చాయి. అమెరికాలో వెరిజాన్ సంస్థ మాత్రమే అపరిమిత 5జీ పథకాలు అమల్లోకి తెచ్చింది. 4జీతో పోలిస్తే ఇవి 50 శాతం అధికంగా ఉన్నాయి. ఐరోపా దేశాల్లో దాదాపు 4జీ టారిఫ్‌లకే 5జీ సేవలు లభిస్తున్నాయి. దేశీయంగా కూడా 4జీ కంటే కాస్త అధికంగా ఉన్నా, మ్యూజిక్ ఛానళ్లకు ఉచిత నమోదు వంటి ఆఫర్లు ఏమైనా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇవీ చూడిండి: బ్యాంకింగ్ రంగంలో ఇబ్బందులున్నాయి, ప్రైవేటీకరిస్తే మరింత రిస్క్