ETV Bharat / business

'ప్రస్తుతం ట్రేడింగ్​లో లాభాలు కష్టమే.. ఆ వ్యూహం పాటించండి' - మార్క్ ఫాబర్​

Marc faber: ప్రస్తుతు పరిస్థితుల్లో ట్రేడింగ్​తో ప్రతిఫలాలు రావడం కష్టమేనన్నారు స్విస్ పెట్టుబడిదారు మార్క్ ఫాబర్​. పెట్టుబడులపై లాభాలు రాకున్నా.. తక్కువగా నష్టపోయే వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు. ఈ మేరకు 'ఇన్ఫామిస్ట్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

marc faber news
marc faber news
author img

By

Published : Jul 20, 2022, 10:40 AM IST

Marc faber: 'ప్రపంచమంతా అధిక ధరలతో.. ఆ ప్రభావం వల్ల ఏర్పడుతున్న మందగమనంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో, మదుపర్లు.. ముఖ్యంగా తొలిసారి డబ్బులు పెడుతున్నవారు తక్కువగా నష్టపోయే వ్యూహాన్ని అనుసరించాల'ని స్విస్‌ పెట్టుబడిదారు,'ది గ్లూమ్‌ బూమ్‌ డూమ్‌' ఎడిటర్‌ మార్క్‌ ఫాబర్‌ సూచిస్తున్నారు. 'అమెరికాలో వడ్డీరేట్లు అధికంగా పెంచబోరని, 6 నెలల్లో తగ్గించడం ప్రారంభం కావచ్చ'ని వార్తా సంస్థ 'ఇన్ఫామిస్ట్‌'కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ..

అమెరికాలో వడ్డీరేట్లు బాగా పెరుగుతాయా: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచాల్సిందే. జపాన్‌ - ఇంగ్లండ్‌ - కెనడా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచిన సమయంలోనే, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కూడా చర్యలు తీసుకుంటే బాగుండేది. ద్రవ్యోల్బణం మాయమవుతుందని ఇటీవలి దాకా చాలామంది అన్నారు. ఇపుడు ఆరు నెలల్లో లేదా 2023లో మాంద్యం రావొచ్చని అంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికా కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ ఏడాది, వచ్చే రెండేళ్లూ రాణిస్తాయనే అంటున్నారు. కానీ గరిష్ఠాల నుంచి అమెరికా కార్పొరేట్ల లాభాలు 50 శాతం తగ్గొచ్చని నేను భావిస్తున్నా. అమెరికా ఫెడ్‌ మాత్రం వడ్డీరేట్లు మరీ ఎక్కువగా పెంచదు.. వచ్చే 6 నెలల్లో మళ్లీ వడ్డీరేట్లు తగ్గిస్తుందనే భావిస్తున్నా.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరల నుంచి వర్థమాన దేశాల పెట్టుబడుదార్లు ఎలా తప్పించుకోవాలి: పెరుగుతున్న కమొడిటీ ధరల నుంచి సాధారణంగా వర్థమాన దేశాలు ప్రయోజనం పొందుతుంటాయి. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెద్ద మాంద్యంలోకి వెళ్లి.. కమొడిటీ ధరలు మరింత తగ్గితే.. వేర్వేరు విభాగాల్లో పెట్టుబడులు పెట్టడమే మంచిదంటాను. అన్ని విభాగాల్లోనూ నష్టపోయే వాతావరణం కనిపిస్తోంది కాబట్టి అతి తక్కువగా నష్టపోయే వ్యూహం రచించుకోవాలి.

భారత మార్కెట్లపై మీ అభిప్రాయం: దీర్ఘకాలానికి భారత్‌పై చాలా సానుకూలంగా ఉన్నాను. అయితే ప్రపంచం శాంతియుతంగా ఉంటేనే సానుకూలతలకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారత ఈక్విటీలు అధిక ధరల్లో ఉన్నాయి.. ఇవి మరింత తగ్గితే, అపుడు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. షేర్ల విలువలు బాగా తగ్గినప్పుడు, కొనేందుకు ఎక్కువమంది సుముఖత చూపరు. ఏడాది సమయంలో బేర్‌ ర్యాలీ అనంతరం కొనుగోళ్లకు ఎక్కువ అవకాశాలు కనిపించొచ్చు.

పసిడి ధరల ధోరణి చూస్తుంటే మీకేమనిపిస్తోంది: పసిడి ధరలు ఉండాల్సిన స్థాయిలోనే కదలాడుతున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గులు ఎప్పటి నుంచో కనిపిస్తున్నాయి. బంగారం ఔన్సు (31.10 గ్రాములు) ధర 2200 లేదా 1500 డాలర్లకూ చేరొచ్చు. 1970లో ఇది 35 డాలర్లు మాత్రమే. 1980 కల్లా 1000 డాలర్లకు దూసుకెళ్లినా.. 1999-2000 సమయానికి మళ్లీ 255 డాలర్లకు పతనమైంది. కాబట్టి ఇపుడు 1800 డాలర్లయినా కొనుగోలు చేయడం మంచిదే. అయితే సమీప భవిష్యత్‌లో ధర తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో మాత్రం పైకే వెళతాయి.

తొలిసారిగా పెట్టుబడులు పెట్టేవారికి మీరిచ్చే సలహా ఏమిటి: మీరు ఆదా చేసిన మొత్తాన్ని పెట్టుబడులుగా పెడుతున్న సమయంలో.. లాభాలు రాకున్నా, ఆ మొత్తం కోల్పోకుండా చూసుకోవాలి. అంటే తక్కువ నష్టపోయేలా వ్యూహం రచించుకోవాలి. నేనైతే ఇపుడు కొంత స్థిరాస్తి, షేర్లు.. మరికొంత బంగారం, వెండిలలో పెట్టుబడులు పెడతాను. ట్రేడింగ్‌ చేస్తే ఎక్కువ డబ్బులేమీ రావు.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య శాంతి నెలకొంటే చమురు ధరలు ఎంత వరకు తగ్గొచ్చు: అప్పుడు చమురు బ్యారల్‌ ధర 80 డాలర్లకు లేదా 60 డాలర్లకూ చేరొచ్చు. గత 10 ఏళ్లలో కొత్తగా అతిపెద్ద చమురు క్షేత్రాలేవీ కనిపెట్టలేదు. దీంతో చమురు వెలికితీత తగ్గుతోంది. నిక్షేపాలను కనుగొనే స్థాయి కంటే, వినియోగ స్థాయే ఎక్కువగా ఉంది. క్రమంగా ప్రతి చమురు క్షేత్రం ఒట్టిపోవచ్చు. అందువల్ల దీర్ఘకాలానికి మాత్రం చమురు ధరలపై నేను ప్రతికూలంగా లేను.

ఇవీ చదవండి: ప్రయాణికుల వాహన ఎగుమతుల్లో 26% వృద్ధి

'అలా అయితే పెరుగు, పప్పు, బియ్యంపై నో జీఎస్​టీ'.. నిర్మల​ క్లారిటీ

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.