SEBI T 1 Settlement : దేశీయ స్టాక్ మార్కెట్లో జరిగే లావాదేవీలను ఎప్పటికప్పుడు సెటిల్‌మెంట్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) కల్లా దీనిని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్ పేర్కొన్నారు. వీలైతే ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచే దీన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ఆమె అన్నారు.
మదుపర్లకు లాభం..
SEBI Settlement Cycle : అయితే ప్రస్తుతం లావాదేవీని సెటిల్‌మెంట్ చేయడానికి ఒక ట్రేడింగ్ రోజు(టీ+1) పడుతుందని.. సెకండరీ మార్కెట్ లావాదేవీలకు కూడా కొత్తగా ప్రవేశపెట్టిన అస్బా (అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) పద్ధతి విజయవంతం అవుతోందని ఆమె తెలిపారు. దీంతో పాటు టెక్నాలజీ సాయంతో కొత్త ఈక్విటీ, డెట్ జారీ, మ్యూచువల్ ఫండ్ పథకాలకు అనుమతుల్లో వేగం అందిపుచ్చుకోవడంపైన కూడా దృష్టి సారిస్తున్నట్లు బచ్ అన్నారు. సెబీ తీసుకునే ఈ చర్యల వల్ల ఇన్వెస్టర్లు ఏటా రూ.3,500 కోట్ల మేర ప్రయోజనాలు పొందగలరని ఆమె చెప్పారు.
నిబంధనల అమలుకు కొత్త వ్యవస్థ..
SEBI New Rules T 1 : నిబంధనల అమలుకు సంబంధించి ఒక సరికొత్త వ్యవస్థను తేవాలని సెబీ భావిస్తోందని మాధబి పురి బచ్ అన్నారు. "మేం ప్రకటించే నిబంధనల అమలు విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటునట్లుగా తరచు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందుకోసమే ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టును తీసుకొచ్చాం. ఇది ఒక రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌లా పని చేస్తుంది." అని ఆమె తెలిపారు. ఏదైనా సంస్థ తమ నిర్దిష్ట సవాళ్లను తెలియజేస్తే గనుక దానికి అనుగుణంగా నిబంధనలను సవరిస్తామని బచ్ స్పష్టం చేశారు.
డీలిస్టింగ్ ప్రక్రియను కూడా..
SEBI Distilling Rules : అలాగే మ్యూచువల్ ఫండ్ రంగంలో 40 సంస్థలే ఉన్నందున.. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ద్వారా నిబంధనల అమలు చాలా సులువుగా జరుగుతుంది. అయితే వేల సంఖ్యలో ఉన్న రిజిస్టర్డ్ కంపెనీల విషయంలో ఇది కాస్త కష్టంగా మారింది. అందుకే ప్రతిపాదిత రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ అంశంపై సీఐఐ, ఫిక్కీ, ఐసీఏఐ, ఐసీఎస్‌సీలతో పాటు నిఫ్టీ-50 లోని కంపెనీల సీఈఓలక కూడా సెబీ లేఖ రాసినట్లు ఆమె వివరించారు. మరోవైపు డీలిస్టింగ్ ప్రక్రియను సమీక్షిస్తున్నామని.. ఈ ఏడాది డిసెంబరు కల్లా ఒక చర్చాపత్రంతో ముందుకొస్తామని బచ్ తెలిపారు. డీలిస్టింగ్‌కు కూడా ఒక స్థిరమైన ధరను పెట్టే అవకాశాన్ని హెచ్‌డీఎఫ్‌సీ మాజీ వైస్ ఛైర్మన్ కేకీ మిస్త్రీ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలిస్తోందని ఆమె పేర్కొన్నారు.