RuPay Credit Card Benefits : నేడు క్రెడిట్ కార్డ్ వాడకం అనేది సర్వసాధారణం అయిపోయింది. మొదట్లో క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌ల్లో మాస్టర్, వీసా కార్డుల హవా నడిచింది. దేశీయంగా అభివృద్ధి చేసిన రూపే కార్డు మాత్రం చాలా కాలం క్రితమే అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ కొన్ని నెలలుగా రూపే క్రెడిట్ కార్డులకు అమాంతం డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులూ ఈ కార్డులను జారీ చేస్తున్నాయి. ఆర్బీఐ.. యూపీఐ (UPI) చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డులను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం.
రూపేతో.. యూపీఐ పేమెంట్స్!
RuPay Credit Card On UPI FAQs : సాధారణంగా బ్యాంకు అకౌంట్ల నుంచి మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుంటుంది. క్రెడిట్ కార్డులను అనుసంధానం చేయడానికి వీలుండదు. అయితే రూపే క్రెడిట్ కార్డులతో మాత్రం యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌లతో ఈ రూపే క్రెడిట్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు. ఆపై ఎక్కడైనా స్కాన్ చేసి నేరుగా, సులువుగా చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే రూపే క్రెడిట్ కార్డు ద్వారా వ్యక్తులకు డబ్బులు పంపించడానికి, వ్యాలెట్ లోడింగ్‌కు అవకాశం ఉండదు.
ప్రయోజనాలు!
RuPay Credit Card Benefits : రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేయడం వల్ల పేమెంట్స్ చాలా సులభతరం అవుతాయి. ముఖ్యంగా ఒక చోట క్రెడిట్ కార్డు, మరో చోట యూపీఐ యాప్ వినియోగించాల్సిన అవసరం ఉండదు. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు సులువుగా పేమెంట్స్ చేయవచ్చు. ప్రతిసారీ క్రెడిట్ కార్డును వెంట పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
రివార్డ్ పాయింట్స్ వస్తాయ్!
RuPay Credit Card Reward Points : సాధారణంగా క్రెడిట్ కార్డు పేమెంట్స్‌పై రివార్డు పాయింట్లు వస్తుంటాయి. అయితే బ్యాంక్ ఖాతా ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై మాత్రం ఎలాంటి రివార్డులు రావు. కానీ రూపే క్రెడిట్ కార్డు ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై రివార్డు పాయింట్లను కూడా పొందే అవకాశం ఉంటుంది.
ఎండీఆర్ ఛార్జీలు ఉండవ్!
RuPay Credit Card MDR Charges : సాధారణంగా కొన్ని చోట్ల క్రెడిట్ కార్డులపై ఎండీఆర్ ఛార్జీలు విధిస్తుంటారు. ఈ ఛార్జీ 2 శాతం వరకు ఉంటుంది. అయితే రూపే క్రెడిట్ కార్డు ద్వారా చేసే పేమెంట్స్‌పై ఈ ఎండీఆర్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అందుకే పాయింట్ ఆఫ్ సేల్ (POS) కార్డు స్వైప్ మెషిన్లు లేని చిన్న చిన్న దుకాణాల్లోనూ.. రూపే క్రెడిట్ కార్డులను ఉపయోగించి యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు.
ఖర్చులను ట్రాక్ చేసుకోవచ్చు!
మీ ఖర్చులను ట్రాక్ చేసుకోవడానికి రూపే క్రెడిట్ కార్డు బాగా ఉపయోగపడుతుంది. రూపే కార్డులో మీ నెలవారీ ఖర్చుల కోసం ఒక పరిమితి పెట్టుకుని, అంతవరకే చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలు లేదా ఇతర క్రెడిట్ కార్డును వినియోగిస్తే.. ఇలా ఖర్చులను ట్రాక్ చేయడం సాధ్యపడదు.
అకౌంట్లో డబ్బు లేకపోయినా!
అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు లేనప్పుడు.. రూపే క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగపడతాయి. బిల్లు చెల్లింపులకు కాస్త గడువు ఉంటుంది కనుక ఆ మేర వినియోగదారుడికి వెసులుబాటు లభిస్తుంది.
యాక్సిడెంటల్ కవరేజీ!
RuPay Card Accidental Insurance : రూపే క్రెడిట్ కార్డులపై యాక్సిడెంటల్ కవరేజీ లభిస్తుంది. కార్డు రకాన్ని అనుసరించి కవరేజీ మొత్తం ఆధారపడి ఉంటుంది.
క్రమశిక్షణ ముఖ్యం!
Credit Card Usage Tips : క్రెడిట్ కార్డు వినియోగదారులు కచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డులను, యూపీఐతో లింక్ చేసే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. యూపీఐ లావాదేవీలకు క్రెడిట్ కార్డులను లింక్ చేయడం వల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. మీరు కనుక స్వయంగా ఖర్చులను నియంత్రణలో ఉంచుకోలేకపోతే.. రూపే క్రెడిట్ కార్డులను మాత్రమే కాదు.. అసలు ఏ క్రెడిట్ కార్డునూ యూపీఐతో లింక్ చేయకపోవడమే మంచిది.
TCS vs TDS : టీడీఎస్, టీసీఎస్ మధ్య తేడా ఏమిటి?.. టాక్స్ రిఫండ్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
NPS New Rule : ఎన్పీఎస్ ఖాతాదారులకు అలర్ట్.. ఇకపై పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ తప్పనిసరి..