బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి తొలిసారిగా యూకేకు చెందిన "ఏషియన్ రిచ్ లిస్ట్ 2022"లో చోటు చేసుకున్నారు. 790 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ.7,700 కోట్ల) సంపదతో సునాక్, అక్షత ఈ జాబితాలో 17వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది జాబితాలోని వారి మొత్తం సంపద 113.2 బిలియన్ పౌండ్లుగా నమోదైంది. 2021తో పోలిస్తే ఇది 13.5 బి. పౌండ్లు అధికం. వరుసగా ఎనిమిదో ఏడాదీ హిందుజా కుటుంబం 30.5 బిలియన్ పౌండ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
2021తో పోలిస్తే 3 బిలియన్ పౌండ్లను అదనంగా హిందూజా కుటుంబం జత చేసుకుంది. ఇక్కడ జరిగిన 24వ వార్షిక ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో హిందుజా గ్రూప్ సహ ఛైర్మన్, గోపీచంద్ హిందుజా కుమార్తె రితు చాబ్రియాకు లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ ఈ "ఏషియన్ రిచ్ లిస్ట్ 2022" ప్రతిని అందజేశారు. బ్రిటన్‌లో ఆసియా సంతతి ఏటా వృద్ధి చెందుతోందనడానికి ఈ జాబితా నిదర్శనమని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
జాబితాలో లక్ష్మీ మిత్తల్, ఆయన కుమారుడు ఆదిత్య (12.8 బి.పౌండ్లు); నిర్మలా సేథియా (6.5 బి.డాలర్లు) తదితరులు ఉన్నారు.