Reliance Industries MCAP: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత సాధించింది. ఒక దశలో మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ. 19 లక్షల కోట్ల మార్కును తాకింది. ఇంత మార్కెట్ విలువను చేరుకున్న తొలి భారత కంపెనీగా నిలిచింది. బుధవారం సెషన్లో తొలుత రిలయన్స్ కంపెనీ షేర్లు.. స్టాక్ మార్కెట్లలో మంచి లాభాలతో ట్రేడయ్యాయి. ఓ దశలో దాదాపు 2 శాతం మేర పెరిగి 2827.10 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అదే సమయంలో మార్కెట్ విలువ రూ. 19 లక్షల కోట్ల మార్కును అధిగమించి.. రూ. 19.12 లక్షల కోట్లకు చేరింది.
ఆఖర్లో స్టాక్ మార్కెట్లలో నష్టాలతో.. రిలయన్స్ షేరు కూడా ఫ్లాట్‌గా ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి.. రిలయన్స్ ఎంక్యాప్ రూ. 18 లక్షల 76 లక్షల కోట్ల వద్ద ఉంది. ఈ ఏడాది మార్చిలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 18 లక్షల కోట్లకు చేరింది. గతేడాది అక్టోబర్ 13న రూ. 17 లక్షల మార్కును అధిగమించింది. 2022లో రిలయన్స్ షేరు 19 శాతానికిపైగా దూసుకెళ్లింది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం సమయంలోనూ భారీగా పెరగడం విశేషం.
''అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. భౌగోళిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా రిలయన్స్ టెలికాం వ్యాపారంపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. రెన్యువబుల్ ఎనర్జీ బిజినెస్‌ను కంపెనీ మరింత విస్తరిస్తోంది.'' అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Stock Market Closing: స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో భారీగా పుంజుకున్న దేశీయ సూచీలు.. బుధవారం పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 537 పాయింట్లు కోల్పోయి.. 56 వేల 819 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 162 పాయింట్ల పతనంతో 17 వేల 38 వద్ద సెషన్‌ను ముగించింది. సెన్సెక్స్ తొలుత దాదాపు 370 పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైంది. ఓ దశలో 750 పాయింట్లకుపైగా కోల్పోయి.. 56 వేల 584 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. 57 వేల 79 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది.
లాభనష్టాల్లో: సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 5 షేర్లు మినహా అన్నీ నష్టాల్లోనే ముగిశాయి. హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, టీసీఎస్ రాణించాయి. బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, విప్రో షేర్లు పడిపోయాయి. విద్యుత్తు, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి.
అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు మార్కెట్ల నష్టాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు నిపుణులు. అమెరికాలో ద్రవ్యోల్బణం భయాలు, కరోనా విజృంభణతో చైనాలో మళ్లీ కఠిన లాక్డౌన్లు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో ఐరోపాలో కష్టాలు.. మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. మంగళవారం సెషన్లో సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 247 పాయింట్లు లాభపడింది. విదేశీ సంస్థాగత మదుపరులు.. వరుసగా అమ్మకాలకే మొగ్గుచూపుతుండటం వల్ల మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఇవీ చూడండి: ఎల్ఐసీ ఐపీఓకు అంతా రెడీ! మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..