Price Changes From July : జులై నెలలో మధ్యతరగతి ప్రజల నెలవారీ బడ్జెట్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగం కోసం వాడే ఎల్పీజీ సిలిండర్ల (వంట గ్యాస్) ధరల్లో మార్పులు రానున్నాయి. అలాగే కమర్షియల్ గ్యాసెస్ సీఎన్జీ, పీఎన్జీ సిలిండర్ల ధరల్లోనూ మార్పులు వస్తాయి. మరోవైపు క్రెడిట్ కార్డు వినియోగంపై టీడీఎస్ విధించేందుకు బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి జులై 31 ఆఖరి గడువుగా ఉంది. ఇవన్నీ సామాన్యుల నెల వారీ బడ్జెట్లో అనేక మార్పులు తీసుకురానున్నాయి.
వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయా?
సాధారణంగా ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తూ ఉంటాయి. ఈ సమయంలో కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటాయి. అందులో భాగంగా జులై నెలలో కూడా వంట గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, జులైలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు పెరుగుతాయా?
జులై నెలలో వాహన వినియోగదారులపైనా భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాసెస్ అయిన సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరల్లోనూ మార్పులు రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల దృష్ట్యా జులైలో సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు కాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
క్రెడిట్ కార్డ్‌లపై టీడీఎస్ భారం!
Credit card TDS charges : క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై జులై 1 నుంచి అధిక భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ వినియోగంపై టీడీఎస్ విధించనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విదేశాల్లో క్రెడిట్ కార్డు వాడితే కచ్చితంగా టీడీఎస్ వసూలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్రెడిట్ కార్డులపై 7 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే.. బ్యాంకులు 20 శాతం వరకు టీడీఎస్ వసూలు చేయనున్నట్లు సమాచారం. అయితే విద్య, వైద్య ఖర్చుల కోసం క్రెడిట్ కార్డు వినియోగిస్తే.. కేవలం 5 శాతం మాత్రమే టీడీఎస్ వసూలు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఐటీఆర్ ఫైలింగ్ మర్చిపోవద్దు
ITR Filling last date : ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయడానికి జులై 31 ఆఖరు తేదీ. ఇప్పటికే పలుమార్లు ఈ గడువును పెంచిన ఆదాయపు పన్ను శాఖ ఇకపై దీనిని మరింత పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు. కనుక ఆదాయపు పన్ను కట్టాల్సిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో గానీ, లేదా ఆఫ్‌లైన్‌లో గానీ ఐటీఆర్ చెల్లించడం మంచిది.