Credit card Tcs 20 : దేశంలో క్రెడిట్ కార్డులు వాడే భారతీయులకు చేదు వార్త. అంతర్జాతీయ లావాదేవీల కోసం వినియోగదారుడు వాడే విదేశీ కార్డులపై జులై 1 నుంచి ఏకంగా 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలతో కూడిన ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. అయితే ఏడాదికి రూ.7 లక్షల వరకు జరిపే ఆర్థిక లావాదేవీలకు ఈ నిబంధన వర్తించదు. కాగా, విద్య, ఆరోగ్యానికి సంబంధించి చేసే అంతర్జాతీయ చెల్లింపుల విషయంలో ఎటువంటి షరతులు వర్తించవు. పూర్తిగా మినహాయింపు ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ ఇవే..
Credit card Tcs Rule : వినియోగదారుడు జరిపే అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను (Foreign Transactions) ఇక నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిధిలోని లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కిందకు తీసుకొచ్చింది. ఇంతకుముందు ఈ రకమైన లావాదేవీలు ఎల్ఆర్ఎస్ పథకం పరిధిలోకి వచ్చేవి కాదు. దీంతో వీటిపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. డెబిట్ కార్డులు, ఫారెక్స్ (విదేశీ) కార్డులు, బ్యాంకుల ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే LRS కింద 5 శాతం ట్యాక్స్ చెల్లించాలి. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో వీటికి సంబంధించి కొన్ని మార్పులను చేసింది ప్రభుత్వం. ఇప్పటివరకు 5 శాతంగా ఉన్న ట్యాక్స్ స్లాబ్ రేట్‌ను జులై 1 నుంచి 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పైన తెలిపిన అన్ని రకాల కార్డులకు వర్తించనుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డులు కూడా ఆ జాబితాలో చేరాయి.
అంతవరకు 5% మాత్రమే!
Credit card Tcs Charges : తాజాగా తెచ్చిన కొత్త రూల్‌తో RBI-LRS స్కీమ్ కింద 5 శాతంగా ఉన్న స్లాబ్ రేట్ ఒకేసారి 20 శాతానికి పెరగడం వల్ల క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై మరో ఆర్థిక భారం పడినట్లయింది. పెరిగిన ఈ స్లాబ్ రేట్ జులై 1న అమల్లోకి వచ్చేలోపు అంటే జూన్ 30 వరకు జరిపే అంతర్జాతీయ లావాదేవీలపై 5 శాతం పన్ను చెల్లించాలి. జులై 1 నుంచి మాత్రం 20% పన్ను కట్టాల్సిందే.
కొత్త క్రెడిట్ కార్డ్ విధానం ఇలా పనిచేస్తుంది!
ఉదాహరణకు.. 'వంశీ' అనే వ్యక్తి విహార యాత్ర కోసం మాల్దీవులకు వెళ్లాడు. అక్కడ తను భారత్‌కు చెందిన క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.8,00,000 ఖర్చు చేశాడు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కంపెనీ వంశీ తరఫున మొత్తం రూ.9,60,000 బిల్లును జనరేట్ చేస్తుంది. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖకు పన్ను(TCS) కింద రూ.1,60,000 చెల్లిస్తుంది. అయితే ఇక్కడ వంశీకి ఊరటనిచ్చే విషయం ఏంటంటే తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయడం ద్వారా ఆ రూ.1,60,000 వేల టీసీఎస్‌ను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త నిబంధన విదేశాలకు వెళ్లే భారతీయుల ఆర్థిక క్రమశిక్షణను మరింత మెరుగుపరుస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.