Financial Changes In August 2023 : సగటు జీవిని ఇబ్బంది పెట్టేందుకు ఆగస్టు నెల రెడీ అయ్యింది! బ్యాంకింగ్ రంగం సహా స్టాక్ మార్కెట్లు, ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేదీ వంటి పలు కీలకమైన ఆర్థికపరమైన అంశాలు మిమ్మల్ని ఆర్థికంగా మరింతగా ఇబ్బంది పడేలా చేయనున్నాయి. మరి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపే ఆ అంశాలు ఇవే..
ఒక్కరోజే గడువు..
ITR Filing Last Date : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి మరో రోజే మిగిలి ఉంది. అంటే ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ నెల 31వరకు అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఈ మూడు రోజుల్లో ఐటీఆర్ పైల్ చేయలేని వారికి ఆగస్టు 1 నుంచి పెనాల్టీని విధిస్తారు. అయితే కొన్ని వారాలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా వరకు ప్రజలు ఐటీఆర్‌ను దాఖలు చేయలేక పోతున్నారు. దీంతో గడువును పొడిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి కేంద్రం ఈ విషయంపై సానుకూలంగా స్పందించకపోతే గనుక సామాన్యుడిపై ఐటీఆర్ పెనాల్టీ భారం తప్పేలా లేదు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం రూ.5 లక్షలపైనా ఆదాయం ఉన్న వ్యక్తులు రూ.5000, రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు రూ.1000 పెనాల్టీ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.
ఆ బ్యాంక్.. ఈ సంస్థ ఆఫర్‌కు చెక్..
Axis Bank Flipkart Credit Card Myntra Offer : యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్టు, మింత్రాలు కలిసి వినియోగదారులో కోసం ఓ స్పెషల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టాయి. అదేంటంటే.. ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్, షాపింగ్ వంటి లావాదేవీలు చేస్తే వాటిపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించాయి. ప్రస్తుతం ఈ ఆఫర్ కొనసాగుతుంది. దీంతో అనేక మంది లబ్ధి కూడా పొందుతున్నారు. అయితే ఈ ఆఫర్‌ను లిమిటెడ్ పీరియడ్‌కు మాత్రమే పరిమితం చేశారు. అంటే ఆగస్టు 11 వరకు మాత్రమే ఈ ఆఫర్ యాక్టివ్‌గా ఉంటుంది.
ఆగస్టు 12 నుంచి 5 శాతం క్యాష్‌బ్యాక్ స్థానంలో కేవలం 1.5 శాతం క్యాష్‌బ్యాక్ మాత్రమే లభించనుంది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై పొందే క్యాష్‌బ్యాక్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా నుంచి వచ్చే గిఫ్ట్ కార్డులు, క్యాష్ అడ్వాన్స్‌లు కూడా ఆగస్టు నెల నుంచి అందవు. అంతేకాకుండా అద్దె చెల్పింపులు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు, యుటిలిటీ బిల్లులు చెల్లించే వాటిపై వచ్చే రాయితీలు వంటివి కూడా కట్ కానున్నాయి. అయితే సంవత్సరానికి రూ.3.5 లక్షల వరకు కొనుగోళ్ల చేసే వినియోగదారులు ఇక నుంచి వార్షిక కార్డ్ రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.
బ్యాంకులు@14 సెలవులు..
Bank Holidays August 2023 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఆగస్టు నెలలో దేశంలోని అన్ని బ్యాంకులకు మొత్తంగా 14 రోజుల సెలవులు వచ్చాయి. ఇందులో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. దీంతో బ్యాంక్ లావాదేవీలు ఎక్కువగా జరిపే వారు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.
స్టాక్ మార్కెట్ సెలవులు..
Share Market Holidays August : శనివారం, ఆదివారాలు సహా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఇండియన్ స్టాక్ మార్కెట్లు మూసి ఉంటాయి. దీంతో వర్కింగ్ డేలో సెలవు రావడం వల్ల ఇన్వెస్టర్ ఆదాయ వనరుపై ప్రభావం పడనుంది.
ఎస్బీఐ అమ్రిత్ కలశ్..
SBI Amrit Kalash Last Date : ఎస్బీఐ అమ్రిత్ కలశ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అందిస్తున్న ఓ 400 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. దీనిని ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ పథకం కింద డిపాజిటర్లకు 7.10 శాతం నుంచి 7.60 శాతం వరకు అధిక వడ్డీని చెల్లిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ గడువు జూన్ 30తో ముగియగా దాన్ని ఆగస్టు 15 వరకు పొడిగించారు. మరో 18 రోజుల్లో గడువు ముగుస్తుండడం వల్ల ఈ ప్రయోజనం పొందుతున్న ఖాతాదారులు నిరాశ చెందుతున్నారు.