Insurance Claims Complaints Procedure : జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం కోసం ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటూ ఉంటాం. అయితే తీరా అవసరం ఏర్పడినప్పుడు.. సదరు బీమా కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరిస్తే.. ఆ బాధ మామూలుగా ఉండదు. మీకు కూడా ఇలాంటి సమస్యే ఎదురైందా?
ఫిర్యాదు చేయవచ్చు!
ఇన్సూరెన్స్ కంపెనీలు.. క్లెయిమ్‌లను తిరస్కరించి, పరిహారం అందించడానికి నిరాకరించినప్పుడు.. వినియోగదారులు వివిధ మార్గాల్లో ఫిర్యాదులు చేయవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీమా భరోసా వ్యవస్థ
IRDAI Complaint Registration Online : బీమా క్లెయిమ్‌లకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఉంది. దీనినే 'బీమా భరోసా సిస్టమ్' అని కూడా అంటారు. దీంట్లో మీరు ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలా అంటే..
- Complaints@irdai.gov.in అనే మెయిల్ అడ్రస్‌కు మీ ఫిర్యాదును పంపించవచ్చు.
- టోల్ ఫ్రీ నంబర్స్ : 155255 లేదా 1800 4254 732 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ఒక్క సంవత్సరంలోపు మాత్రమే!
Insurance Claim Time Limit : ఇన్సూరెన్స్ కంపెనీ.. మీ బీమా క్లెయిమ్‌ను తిరస్కరించిన తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు 'ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మెన్' వద్ద ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలా అంటే..
- ఆన్లైన్లో https://www.cioins.co.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి, అందులో మీ కంప్లైంట్‌ను నమోదు చేయవచ్చు. లేదా
- మీకు దగ్గర్లో ఉన్న అంబుడ్స్‌మెన్ కార్యాలయానికి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.
కన్జూమర్ కోర్టులోనూ ఫిర్యాదు చేయవచ్చు!
Consumer Forum Complaint Process : బీమా కంపెనీలు.. మీకు పరిహారం అందించడానికి నిరాకరిస్తే.. కన్జూమర్ కోర్టులో కూడా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీరు.. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌లో కంప్లైంట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి మీరు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు కంప్లైంట్ లెటర్‌తోపాటు, అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ను అందించాల్సి ఉంటుంది. అయితే కన్జూమర్ ఫోరమ్ మీ నుంచి రూ.100 నుంచి రూ.5000 వరకు ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుంది.
పరిహారం ఎప్పుడు లభిస్తుంది?
మీరు బీమా పాలసీ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకు కచ్చితంగా అన్ని వాస్తవ విషయాలు తెలియజేయాలి. ప్రీమియంలను క్రమం తప్పకుండా కట్టాలి. అప్పుడు మాత్రమే మీరు క్లెయిమ్‌లను పొందడానికి అర్హులు అవుతారు. ఒక వేళ మీరు వాస్తవ విషయాలు దాచిపెట్టినా, లేదా సకాలంలో ప్రీమియంలను చెల్లించకపోయినా.. క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
బీమా కంపెనీలు నిర్ణయించలేవు!
దురదృష్టవశాత్తు పాలసీదారునకు ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఏర్పడి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. అతను/ ఆమె సదరు అనారోగ్య సమస్యకు ఆసుపత్రిలో చేరాలా? వద్దా? అనేది బీమా సంస్థ నిర్ణయించకూడదు. కేవలం వైద్యులు మాత్రమే.. దానిని నిర్ణయించగలరు. ఈ విషయాన్ని ఇటీవల సూరత్ జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది. హాస్పిటల్లో చేరాల్సిన అవసరాన్ని బీమా కంపెనీ నిర్ణయించకుండా.. వైద్య నిపుణుల విచక్షణకు వదిలివేయాలని కమిషన్ తీర్పు చెప్పింది.