How To Use Credit Card For Shopping : మన వద్ద డబ్బు ఉన్నా, కొన్ని రకాల ఆఫర్ల కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగించడం చాలా మంచిది. ఎందుకంటే న్యూ ఇయర్, క్రిస్మస్, సంక్రాంతి లాంటి పండుగ సీజన్లలో చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులపై మంచి ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తుంటాయి. అలాగే నగదు పెట్టి కొంటామంటే పూర్తి మొత్తం వసూలు చేసే సంస్థలు, క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తామంటే మాత్రం మంచి డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్, నో-కాస్ట్ ఈఎంఐ లాంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తుంటాయి. పైగా క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేస్తే, అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డులు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
అత్యంత సౌకర్యవంతం
క్రెడిట్ కార్డు సక్రమంగా వినియోగిస్తే దాన్ని మించిన సౌకర్యవంతమైన సాధనం మరొకటి ఉండదు. క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేయడం చాలా సులభం అవుతుంది. పైగా నగదు తీసుకువెళ్లి, దాని భద్రత కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. దొంగల భయం ఉండదు. పేమెంట్ చేసేటప్పుడు ఎక్కువ, తక్కువ ఇచ్చేస్తామనే టెన్షన్‌కు దూరంగా ఉండొచ్చు. చిన్నమొత్తమైనా, పెద్ద మొత్తమైనా క్రెడిట్ కార్డు స్వైప్ చేసి సులభంగా చెల్లించవచ్చు.
స్వైప్ ద్వారా భద్రత
మన దగ్గర డబ్బు లేకపోయినా, క్రెడిట్ కార్డు ఉంటే చాలు, నిశ్చింతగా నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డు దొంగతనానికి గురైనా, వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి బ్లాక్ చేయించడం ద్వారా నష్టపోకుండా ఉండొచ్చు. అనధికార వినియోగాన్ని అరికట్టవచ్చు. ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చు.
ప్రత్యేక రివార్డులు, డిస్కౌంట్లు
పండగ సీజన్లో వ్యాపార సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కొనుగోళ్లపై డిస్కౌంట్లు ఇస్తుంటాయి. రివార్డు పాయింట్లు బహూకరిస్తాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. ఈ రివార్డులు, డిస్కౌంట్లు, ఆఫర్లు పొందాలంటే కచ్చితంగా క్రెడిట్ కార్డును వినియోగించకతప్పదు. అందుకే పండగ సీజన్లో క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేయడం మంచిది.
సులభంగా గ్లోబల్ షాపింగ్
మీ క్రెడిట్ కార్డు ఉపయోగించి, ప్రపంచంలోని ఏ వస్తువునైనా కొనుగోలు చేయవచ్చు. హై-ఎండ్ ఫ్యాషన్ వస్తువుల నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ వరకు అన్నింటినీ క్రెడిట్ కార్డులను ద్వారా కొనచ్చు. యూనివర్సల్ పేమెంట్లకు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి. అనేక అంతర్జాతీయ వెబ్ సైట్లు క్రెడిట్ కార్డు వినియోగదారులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. కనుక మీ ఇంటి నుంచే సులువుగా గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్స్‌తో షాపింగ్ చేసుకోవచ్చు.
క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం
క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీలు చేసిన తర్వాత సకాలంలో రీపేమెంట్ చేయాలి. అలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్ చక్కగా పెరుగుతుంది. దీనివల్ల మీరు రుణాలను సులువుగా పొందడానికి వీలవుతుంది. పైగా తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందవచ్చు. మీ క్రెడిట్ కార్డు పేమెంట్స్‌ను బాధ్యతగా చేయడం వల్ల మరెన్నో ఆఫర్లు కూడా పొందవచ్చు. అయితే ఆఫర్లు ఉన్నాయి కదా అని క్రెడిట్ కార్డులను ఇష్టానుసారంగా వాడకూడదు. తిరిగి చెల్లించే సామర్థ్యం, కొనుగోలు చేస్తున్న వస్తువుల వల్ల మీకెంత ప్రయోజనం కలుగుతుంది అనే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. క్రెడిట్ కార్డు ఉంది కదా అని అనవసర ఖర్చులు చేస్తే, అవి మీ ఆర్థికస్థితిని దెబ్బతీసే అవకాశం ఉంది. అందువల్ల క్రెడిట్ కార్డులు ఉపయోగించేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
భవిష్యత్ భద్రంగా ఉండాలా? ఈ లేటెస్ట్ LIC పాలసీలపై ఓ లుక్కేయండి!
కొత్త బైక్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్-10 టూ-వీలర్స్ ఇవే!