How To Get Business Loan : సొంతంగా వ్యాపారం చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది. మరికొంత మందికి ఇప్పటికే ఉన్న తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ఆశ ఉంటుంది. కానీ సరిపడా పెట్టుబడి ఉండదు. అందువల్ల బ్యాంక్ లోన్ తీసుకుందామని అనుకుంటారు. కానీ బ్యాంక్ లోన్ ఎలా వస్తుందో, ఎలా అప్లై చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారా? అయితే ఇది మీ కోసమే. బ్యాంక్‌ల నుంచి బిజినెస్ లోన్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లోన్ ఎందుకు?
బిజినెస్ లోన్‌కు అప్లై చేసే ముందు.. ఎంత మొత్తం రుణం కావాలి? అదీ ఎందుకు అవసరమనే విషయాలపై మీకు పూర్తి స్పష్టత ఉండాలి. ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలన్న దానిపై కూడా ఒక అవహగానకు రావాలి. వాస్తవానికి మీరు చేసే వ్యాపారానికి అనుగుణంగా లోన్ అప్లై చేసుకోవాలి. అలాగే తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా బేరీజు వేసుకోవాలి.
2. లోన్ పొందేందుకు ఎవరు అర్హతలు..
Business Loan Eligibility :
- మీరు భారతీయ పౌరులై ఉండాలి.
- కనీసం మూడేళ్ల వ్యాపార అనుభవం ఉండాలి. (ఇప్పటికే వ్యాపారం మొదలుపెట్టి ఉంటే!)
- సిబిల్ స్కోర్ 650 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
- స్వయం ఉపాధిపై ఆధారపడి ఉండాలి.
- 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి.
ITR లేకుండా 'లోన్' ఎలా పొందాలో తెలుసా?
3. వివిధ లోన్ ఆప్షన్లను బేరీజు వేసుకోవాలి!
వివిధ బ్యాంకులు వివిధ రకాలైన నిబంధనలను అనుసరించి రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు కాస్త పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తే.. మరికొన్ని చిన్న మొత్తాల్లో రుణాలు ఇస్తూ ఉంటాయి. అలాగే ఆయా బ్యాంకులను అనుసరించి వడ్డీ రేట్లు కూడా మారుతూ ఉంటాయి. కనుక లోన్ తీసుకుందామని నిర్ణయించుకున్న వెంటనే.. మార్కెట్లో ఎలాంటి లోన్లు అందుబాటులో ఉన్నాయి. ఏ లోన్ వల్ల ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుంది.. అనే విషయాలను ముందుగా బేరీజు వేసుకోవాలి. వివిధ రకాల లోన్లను పరిశీలించుకున్న తరువాతనే రుణం తీసుకునేందుకు ముందడుగు వేయాలి.
4. ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి!
Required Loan Documents : లోన్ ఆఫ్షన్‌ను ఎంచుకున్న తరువాత అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను, దరఖాస్తును సిద్ధం చేసుకోవాలి. మీ గుర్తింపు, అడ్రస్, ఆదాయం, బిజినెస్ ఫ్రూప్, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలను తెలిపే పత్రాలు అన్నింటినీ సమకూర్చుకోవాలి.
- ఆధార్/ పాస్‌పోర్ట్/ ఓటరు
- పాన్ కార్డ్
- బిజినెస్ ప్లాన్
- వ్యాపార యాజమాన్యం ఫ్రూప్
- ఇతర ఆర్థిక పత్రాలు
వివిధ బ్యాంకులు వివిధ రకాలైన రూల్స్ & రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంటాయి. వాటికి అనుగుణంగా అన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
5. ఓపిక అవసరం!
లోన్ కోసం అవసరమైన పత్రాలను అన్నింటినీ సిద్ధం చేసుకుని.. వాటినికి నేరుగా బ్యాంక్‌లో సబ్మిట్ చేయవచ్చు. లేదా ఆన్లైన్లో కూడా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ లోన్ ప్రక్రియ కాస్త సమయం తీసుకుంటుంది. కనుక లోన్ మంజూరు అయ్యే వరకు కాస్త వేచీ చూడాల్సి ఉంటుంది.
నోట్ : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వాస్తవానికి ఆయా బ్యాంకులను అనుసరించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి. అలాగే రుణార్హతలు, రుణ మొత్తం, వడ్డీ రేట్లు, లోన్ టెన్యూర్ ఇలా అన్ని విషయాల్లో మార్పులు ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అవసరమైతే మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి.
Income Tax Investment Plan : ఆదాయం ఎక్కువగా.. పన్ను తక్కువగా ఉండాలా?.. ఇలా ప్లాన్ చేసుకోండి!